పెట్రోల్‌‌, డీజిల్‌‌ పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించలేం!

పెట్రోల్‌‌, డీజిల్‌‌ పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించలేం!
  • యూపీఏ ప్రభుత్వం తెచ్చిన  ఆయిల్ బాండ్ల అప్పులు ఇంకా తీరలేదు
  • ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్‌‌

న్యూఢిల్లీ: పెట్రోల్‌‌, డీజిల్ రేట్లను తగ్గించడానికి వీటిపైన విధిస్తున్న ఎక్సైజ్‌‌ డ్యూటీని తగ్గించే ఆలోచనలేదని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఆయిల్ బాండ్ల బకాయిలను తీరుస్తున్నామని, దీంతో ప్రభుత్వానికి కొన్ని పరిమితులున్నాయని చెప్పారు.  గ్లోబల్‌‌ మార్కెట్లలో పెట్రోల్‌‌, డీజిల్ రేట్లు పెరుగుతున్నా, ఇండియాలో పెరగకుండా ఉండడానికి యూపీఏ గవర్నమెంట్ ఆయిల్ బాండ్లను  ప్రభుత్వ ఆయిల్ కంపెనీలకు ఇష్యూ చేసేంది. అంటే రేట్లలో తేడాను ప్రభుత్వమే కంపెనీలకు చెల్లిస్తుందని బాండ్లను ఇష్యూ చేయడం ద్వారా ఒప్పుకుంది.  ఈ ఆయిల్ బాండ్లపై గత ఐదేళ్లలో వడ్డీ కిందే రూ.60 వేల కోట్లను చెల్లించామని సీతారామన్ అన్నారు. ఇంకా రూ. 1.30 లక్షల కోట్ల బకాయిలను తీర్చాల్సి ఉందని పేర్కొన్నారు. ‘ఆయిల్ బాండ్ల బకాయిలను చెల్లించాల్సిన అవసరం  లేకపోయి ఉంటే పెట్రోల్‌‌, డీజిల్‌‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే పొజిషన్‌‌లో ఉండేవాళ్లం’ అని సీతారామన్‌‌ పేర్కొన్నారు.

రెట్రోట్యాక్స్‌‌ ఉపసంహరణకు రూల్స్‌‌.. 
కెయిర్న్‌‌, వొడాఫోన్‌‌ వంటి కంపెనీలపై  వేసిన రెట్రోస్పెక్టివ్‌‌ ట్యాక్స్‌‌ డిమాండ్స్‌‌ను ఉపసంహరించుకోవడానికి రూల్స్‌‌ను త్వరలో రెడీ చేస్తామని సీతారామన్ పేర్కొన్నారు. రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్‌‌ను ఉపసంహరించుకునే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రెట్రోట్యాక్స్ కేసులను క్లోజ్‌‌ చేసుకోవడానికి, రిఫండ్ కోసం  ఫైనాన్స్ మినిస్ట్రీ అధికారులతో కెయిర్న్‌‌, వొడాఫోన్ కంపెనీలు చర్చలు జరుపుతున్నాయని  ఆమె అన్నారు. కొత్తగా తీసుకొచ్చిన ఐటీ పోర్టల్‌‌లోని టెక్నికల్‌‌ సమస్యలపై సీతారామన్ మాట్లాడారు. మరో రెండు మూడు వారాల్లో  టెక్నికల్ సమస్యలు తొలగిపోతాయని హామీ ఇచ్చారు. కొత్తగా తెచ్చిన ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్‌‌ ఈ–ఫైలింగ్ పోర్టల్‌‌లో టెక్నికల్‌‌ సమస్యలపై  ఇన్ఫోసిస్‌‌కు తరచూ గుర్తు చేస్తున్నామని చెప్పారు. వీటిని త్వరలో పరిష్కరిస్తామని ఇన్ఫోసిస్‌‌ హెడ్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.