EPF వడ్డీపై ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్

EPF వడ్డీపై ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్

ఢిల్లీ : PF ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించిది కేంద్ర ఆర్థిక శాఖ. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును 8.65 శాతానికి ఆమోదం తెలుపుతున్నట్లు శుక్రవారం తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సర EPFకు ఇది వర్తిస్తుంది. పలు రంగాల్లో పనిచేస్తున్న 6 కోట్ల మందికి మేలు చేకూరుస్తుందని అంచనా. ఖాతాదారులకు 2018-19 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ ఇవ్వాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO తీసుకున్న నిర్ణయానికి ఆర్థిక శాఖ విభాగమైన ఆర్థిక సేవల విభాగం ఆమోదం తెలిపిందని సంబంధిత అధికారులు తెలిపారు.

2016 నుంచి EPF వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు. 8.55 శాతంగానే కొనసాగుతూ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే EPF వడ్డీ రేటును 8.55 శాతం నుంచి 8.65 శాతానికి పెంచుతూ.. EPFO నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయానికి ఆర్థిక శాఖ ఆమోదం రావాల్సి ఉండగా… శుక్రవారం ఆమోదముద్ర పడింది. ఇప్పుడు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆదాయపు పన్ను శాఖ, కార్మిక శాఖ 2018-19 ఆర్థిక సంవత్సరం నాటి వడ్డీ రేటుపై అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది. ఆ తర్వాత పెరిగిన వడ్డీని ఖాతాదారుల అకౌంట్లలో జమ చేయాలని 120 ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలు వెళ్తాయి. ఇక అప్పటి నుంచి పెరిగిన వడ్డీ ప్రకారమే క్లెయిమ్ సెటిల్మెంట్లు ఉంటాయి.