ప్రతి సంస్థ జీఎస్టీ కట్టాలె : నిర్మలా సీతారామన్​

ప్రతి సంస్థ జీఎస్టీ కట్టాలె : నిర్మలా సీతారామన్​

న్యూఢిల్లీ :  అన్ని వ్యాపార సంస్థలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై  ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టి సారించిందని కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం చెప్పారు. జీఎస్టీ ఆదాయం పెంచడంతోపాటు అన్ని సంస్థలూ పన్ను చెల్లించేలా చేయాలని అధికారులకు ఆమె సూచించారు. గుజరాత్‌‌‌‌లో బుధవారం 12 జీఎస్‌‌‌‌టీ సువిధ కేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇవి వ్యాపార సంస్థలు సక్రమంగా జీఎస్టీ నమోదు చేయడంలో సహాయపడతాయని, ఏవైనా ఇబ్బందులు ఉన్నా పరిష్కరిస్తాయని చెప్పారు. "జీఎస్టీ సేకరణ ప్రతి సంవత్సరం, ప్రతి నెల పెరుగుతోంది.

గతంతో పోలిస్తే అనేక వస్తువులపై పన్ను రేట్లు తగ్గించాం. వ్యాపారులకు జీఎస్టీ కింద డబుల్ పన్ను విధించరని తెలుసు. చాలా సంస్థలు ఇప్పటికీ జీఎస్టీ పరిధికి దూరంగా ఉండటానికి ఇష్టపడుతున్నాయి. ఇవన్నీ పన్ను పరిధిలోకి రావాలి”అని ఆమె అన్నారు.  జీఎస్టీ దూరంగా ఉండటం వల్ల ప్రయోజనం పొందుతారని భావించడం పొరపాటని, ఇలా చేయడం వల్ల  కొనుగోలుదారులను కోల్పోతారని అన్నారు. ప్రభుత్వ పోర్టల్‌‌‌‌లో చెల్లించిన జీఎస్‌‌‌‌టీ బిల్లులను అప్‌‌‌‌లోడ్ చేసిన ఐదుగురికి డ్రా ఆధారంగా ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఈ కార్యక్రమంలో బహూకరించారు.  ఈ ఏడాది అక్టోబరులో జీఎస్టీ రాబడి వసూళ్ల విలువ రూ. 1.72 లక్షల కోట్లకు చేరింది.