ఇన్‌కమ్‌ ట్యాక్స్ సైట్ ఇష్యూ: ఇన్ఫోసిస్‌ సీఈవోకు కేంద్ర ఆర్థిక శాఖ సమన్లు

ఇన్‌కమ్‌ ట్యాక్స్ సైట్ ఇష్యూ: ఇన్ఫోసిస్‌ సీఈవోకు కేంద్ర ఆర్థిక శాఖ సమన్లు

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను (ఇన్‌కమ్‌ ట్యాక్స్) ఫైలింగ్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌లో పదే పదే టెక్నికల్ సమస్యలు రావడం, హ్యాంగ్ అయిపోతూ ఉండడంపై కేంద్ర ఆర్థిక శాఖ భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీకి సమన్లు జారీ చేసింది. ఈ సమస్యపై వివరణ ఇచ్చేందుకు రేపు (సోమవారం) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎదుట హాజరుకావాలని.. ఆ కంపెనీ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్‌కు నోటీసులు పంపినట్లు ఐటీ డిపార్ట్‌మెంట్ అధికారిక ట్విట్టర్‌‌లో వెల్లడించింది. ఐటీ ఈ–ఫైలింగ్ కోసం కొత్త పోర్టల్‌ను లాంచ్ చేసి రెండున్నర నెలలు దాటినా ఇప్పటికీ సమస్యలను పరిష్కరించలేకపోవడానికి కారణమేంటో వివరించాలని ఆదేశించినట్లు పేర్కొంది.

యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా ఐటీ ఫైలింగ్ పోర్టల్ ఉండాలని కొత్తగా డెవలప్ చేసేందుకు 2019 జనవరి – 2021 జూన్ మధ్య రూ.164.5 కోట్లుతో ఇన్ఫోసిస్‌కు కేంద్ర ఆర్థిక శాఖ ప్రాజెక్టును అప్పగించింది. ఈ ఐటీ కంపెనీ వర్క్ పూర్తి చేశాక జూన్ 7న కొత్త ఐటీ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. అయితే ఐటీ ఫైలింగ్‌లో ట్యాక్స్‌ పేయర్లు, ట్యాక్స్ ప్రొఫెషనల్స్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఐటీ ఫైలింగ్ ప్రొఫైల్ మార్పులు, పాస్‌వర్డ్ మార్చుకోవడం లాంటి చిన్న చిన్న విషయాల్లోనూ, ఫైలింగ్ సమయంలో సైట్ హ్యాంగ్ కావడం వంటి సమస్యలు పదే పదే వస్తుండడంతో ట్యాక్స్ పేయర్లు కేంద్ర ఆర్థిక మంత్రిని ట్యాగ్‌ చేస్తూ సోషల్ మీడియాలో అనేక సార్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటికే ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకనీ వారం వారం కేంద్ర ఆర్థిక మంత్రికి రిపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే రెండున్నర నెలలు దాటినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇప్పడు నేరుగా సీఈవోకే నోటీసులు పంపింది కేంద్ర ప్రభుత్వం.