కోల్‌‌‌‌కతా ఆయుధాల స్మగ్లర్స్‌‌‌‌తో మల్లేశ్ కు లింకులు! ఆర్థిక ఒత్తిడితోనే ఆయుధాల చోరీకి ప్లాన్

కోల్‌‌‌‌కతా ఆయుధాల స్మగ్లర్స్‌‌‌‌తో మల్లేశ్ కు లింకులు! ఆర్థిక ఒత్తిడితోనే ఆయుధాల చోరీకి ప్లాన్
  • ఆర్థిక ఒత్తిడితోనే ఆయుధాల చోరీకి ప్లాన్ చేసిన మాజీ హవల్దార్
  •     చోరీ అనంతరం కోల్‌‌‌‌కతా ముఠాతో రహస్య ఒప్పందాలు
  •     కస్టడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి
  •     కోల్‌‌‌‌కతా కేంద్రంగా ఆయుధాల అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు
  •     మల్లేశ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా 8 మందిని అరెస్టు చేసిన మేడ్చల్ పోలీసులు
  •     నేడు మీడియాకు వివరాలు వెల్లడించనున్న డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బొల్లారంలోని ఆర్మీ మద్రాస్‌‌‌‌ రెజిమెంట్‌‌‌‌ ఆయుధాల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ హవల్దార్ మల్లేశ్‌‌‌‌ను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించగా.. ఆయనకు పశ్చిమ బెంగాల్‌‌‌‌లోని అంతర్‌‌‌‌రాష్ట్ర ఆయుధాల స్మగ్లింగ్ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు తేలింది.  కోల్‌‌‌‌కతా కేంద్రంగా దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు బంగ్లాదేశ్‌‌‌‌కు అక్రమంగా ఆయుధాలు విక్రయిస్తున్న ఈ ముఠా గుట్టును మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోలీసులు రట్టు చేశారు. కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌‌‌‌కు చెందిన ముగ్గురితో పాటు ఆయుధాల చోరీకి సహకరించిన మరో ముగ్గురు ఆర్మీ ఉద్యోగులు, మల్లేశ్ స్నేహితులు ఇద్దరు కలిపి మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పది రోజుల కస్టడీలో మల్లేశ్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ భారీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను పోలీసులు చేధించారు. ఆయుధాల చోరీ, కొనుగోళ్ల ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ శనివారం మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించనున్నారు.

 నేరానికి పాల్పడటానికి దారితీసిన పరిస్థితులివే..!

విచారణలో మల్లేశ్ నేరానికి పాల్పడటానికి దారితీసిన పరిస్థితులు, పథకం అమలు చేసిన తీరు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. 2009లో భారత సైన్యంలో చేరిన మల్లేశ్.. ఆయుధాలు భద్రపరిచే ఆర్మరీ బాధ్యతలను నిర్వర్తించారు. 2022లో కోల్‌‌‌‌కతాలోని బ్యారక్‌‌‌‌పూర్ కంటోన్మెంట్‌‌‌‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్కడికి  సమీపంలో ఉన్న చెరుకు రసం దుకాణదారుడు బీర్బల్ షాతో పరిచయం ఏర్పడింది. అప్పటికే బీర్బల్ షాకు అక్రమ ఆయుధాల వ్యాపారి అవల్ దెయ్ అలియాస్ ఓబీతో సంబంధాలు ఉన్నాయి.  బీర్బల్ సూచన మేరకు మల్లేశ్ ఓబీ వద్ద రూ.10 వేలకే ఒక తుపాకీని కొనుగోలు చేశాడు. కొంతకాలం సస్పెన్షన్‌‌‌‌లో ఉన్న మల్లేశ్.. 2023లో మళ్లీ విధుల్లో చేరి 2025 జూన్‌‌‌‌లో బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌‌‌‌కు బదిలీపై వచ్చారు. నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌లో రూ.8 లక్షల విలువైన ప్లాట్ కొనుగోలు చేయడం, ఇంటి నిర్మాణం చేపట్టడంతో  ఆర్థిక భారం పడింది. ఆ ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఆర్మీ ఆయుధాలను చోరీ చేసి కోల్‌‌‌‌కతాలో విక్రయించాలని ప్లాన్ వేసుకున్నారు. ఇందుకోసం తొలుత తన స్నేహితులైన నిరంజన్, మల్లికార్జున్‌‌‌‌ల సహాయం కోరినప్పటికీ వారు అంగీకరించకపోవడంతో మల్లేశ్ తన వ్యూహాన్ని మార్చుకున్నారు.

ఆర్మీ సిబ్బంది సహకారంతోనే ఆయుధాల చోరీ

ఈ ఏడాది జూలైలో మద్రాస్ రెజిమెంట్ 20వ బెటాలియన్‌‌‌‌లో రెక్కి నిర్వహించిన మల్లేశ్.. అక్కడ పనిచేస్తున్న శేషు, తన బ్యాచ్‌‌‌‌మేట్ ప్రవీణ్‌‌‌‌ల సహాయం తీసుకున్నారు. ఆయుధాలు, మందుగుండును దొంగిలించేందుకు శేషుతో పాటు అక్కడ పనిచేస్తున్న మరో ఉద్యోగి వినోద్‌‌‌‌ను కూడా సంప్రదించారు. చోరీకి ముందు ఫుట్‌‌‌‌బాల్ గ్రౌండ్ వద్ద శేషు ద్వారా వినోద్‌‌‌‌కు మల్లేశ్ రూ. లక్ష అందజేసినట్లు పోలీసులు గుర్తించారు. చోరీకి వారం రోజుల ముందే ప్రణాళిక సిద్ధం చేసుకున్న నిందితులు.. ఘటన రోజు ఫోమ్ చల్లి సీసీ కెమెరాలు పని చేయకుండా చేశారు. ప్రవీణ్, శేషులు లైట్లు ఆర్పేయగా, మల్లేశ్ గంటన్నర పాటు ఆయుధాలను తరలించారు. ఆ టైంలో  ఇతర జవాన్లను శేషు, ప్రవీణ్ మాటల్లో పెట్టి డైవర్ట్ చేశారు. చోరీ పూర్తయిన వెంటనే మల్లేశ్ కోల్‌‌‌‌కతాలోని బీర్బల్ షాను సంప్రదించారని పోలీసులు ఆధారాలు సేకరించారు.

నాలుగు ఏకే-47లకు రూ.5 లక్షలు

ఆయుధాలను బీర్బల్ షా ద్వారా అక్రమ ఆయుధాల వ్యాపారి ఓబీకి సరఫరా చేసేందుకు మల్లేశ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. నాలుగు ఏకే-47 తుపాకీలకు రూ.5 లక్షలు, పిస్టళ్లకు రూ.3 లక్షలు ఇవ్వాలని బీర్బల్ షా బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బీర్బల్‌‌‌‌ షా, అవల్‌‌‌‌‌‌‌‌ దెయ్‌‌‌‌లు నడుపుతున్న ప్రమాదకర ఆయుధాల నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ శనివారం మీడియాకు వెల్లడించనున్నారు.