ఏవియేషన్​లో మస్తు బిజినెస్: వివేక్​ జోషి

ఏవియేషన్​లో మస్తు బిజినెస్: వివేక్​ జోషి

న్యూఢిల్లీ: ఏవియేషన్ ​ఇండస్ట్రీకి దేశంలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని ఫైనాన్షియల్​ సర్వీసెస్​ సెక్రటరీ వివేక్​ జోషి చెప్పారు. ఈ రంగంలో పెట్టుబడులు పెంచేందుకు చొరవ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్​పోర్ట్​ సెక్టార్‌‌పై  ఐఐఎఫ్​సీఎల్​ నిర్వహించిన రౌండ్​ టేబుల్​ కాన్ఫరెన్స్​లో వివేక్​ జోషి పాల్గొన్నారు. ఉడే దేష్​కా ఆమ్​ నాగరిక్​ (ఉడాన్​) స్కీము తేవడంతో దేశంలోని ఏవియేషన్​ ఇండస్ట్రీ గత ఏడెనిమిదేళ్లలో పుంజుకుందని పేర్కొన్నారు. 

దీంతో 2014 లో 74 గా ఉన్న ఎయిర్​పోర్టుల సంఖ్య రెట్టింపై 148 కి చేరిందని వివరించారు. మరో 21 గ్రీన్​ఫీల్డ్​ఎయిర్​పోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చిందన్నారు. నోయిడా, నవీ ముంబైలలో రానున్న రెండు పెద్ద ఎయిర్​పోర్టుల కెపాసిటీని భారీగా పెంచనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం తెచ్చిన ఇండస్ట్రీ– ఫ్రెండ్లీ పాలసీల వల్లే ఏవియేషన్ ఇండస్ట్రీ జోరందుకుందని వెల్లడించారు. 

మన ఏవియేషన్​ ఇండస్ట్రీ ప్రపంచంలో మూడో పెద్దదని, మరింతగా ఎదగడానికి మనకు అవకాశాలున్నాయని జోషి వివరించారు. గడిచిన పదేళ్లలో మన ఏవియేషన్​ ఇండస్ట్రీ ఏటా 10 శాతం చొప్పున గ్రోత్​ సాధించిందని, గ్లోబల్​ యావరేజ్ ​కంటే ఇది రెండున్నర రెట్లు ఎక్కువని పేర్కొన్నారు. ఈ రంగం మరింతగా విస్తరించడానికి​ ఎయిర్​క్రాఫ్ట్, ప్లేన్​ ఇంజిన్స్​, ఎయిర్​ఫ్రేమ్స్​, హెలికాప్టర్స్​ వంటి వాటి ట్రాన్సాక్షన్లను ఇన్​సాల్వెన్సీ అండ్​ బ్యాంక్​రప్టసీ (ఐబీసీ) కోడ్​ నుంచి కిందటి వారమే కార్పొరేట్​ అఫెయిర్స్​  మినిస్ట్రీ  మినహాయించిందని జోషి వివరించారు.