11 మందికి ఫింగర్ ప్రింట్ సర్జరీ చేసిన ముఠా అరెస్ట్

11 మందికి ఫింగర్ ప్రింట్ సర్జరీ చేసిన ముఠా అరెస్ట్

హైదరాబాద్ : గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు యువత అడ్డదారులు తొక్కుతున్న వ్యవహారం హైదరాబాద్ లో బయటపడింది. వారు అక్రమంగా గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు సహకరిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నాగ మహేశ్వర్ రెడ్డి, వెంకట రమణ,శివ శంకర్ రెడ్డి,  రామకృష్ణారెడ్డి ముఠాగా ఏర్పడి ఈ  దందా నిర్వహిస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ప్రకటించారు. నిందితులు ఇప్పటి వరకు 11 మందికి సర్జరీ చేశారని,  ఫింగర్ ప్రింట్ ఆపరేషన్ చేయించుకున్న పలువురు యువకులు ఇప్పటికే కువైట్ కు వెళ్లినట్లు దర్యాప్తులో తేలినట్లు చెప్పారు.  

కడపకు చెందిన వ్యక్తికి శ్రీలంకలో ఫింగర్ ప్రింట్ సర్జరీ చేయించుకున్నాడన్న సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు టీమ్ లుగా ఏర్పడి రంగంలోకి దిగారు. తాజాగా హైదరాబాద్ ఘట్ కేసర్ లో ఒక వ్యక్తికి ఆపరేషన్ చేసేందుకు డాక్టర్ రాగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో ఫింగర్ ప్రింట్ సర్జరీకి డాక్టర్లు రూ. 25వేలు వసూలు చేస్తున్నట్లు సీపీ చెప్పారు. కేరళలో ఆరుగురు, రాజస్థాన్ లో ఇద్దరితో పాటు కడపకుచెందిన మరో ముగ్గురికి ఈ సర్జరీ చేసినట్లు గుర్తించారు. ఫింగర్ ప్రింట్ ఆపరేషన్ చేయించుకున్న ఇద్దరినీ కూడా అరెస్ట్ చేసినట్లు సీపీ ప్రకటించారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 420తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసినట్లు చెప్పారు.

గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటే వేలిముద్రలు తప్పనిసరి. ఒకసారి రిజెక్టైన యువకులు మళ్లీ వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఫింగర్ ప్రింట్ సర్జరీని ఆశ్రయిస్తున్నారు. సర్జరీ జరిగిన 3 నెలల తర్వాత కువైట్ వెళ్లేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అక్కడి వెళ్లిన తర్వాత ఇమ్మిగ్రేషన్ లో దొరికిపోతుండటంతో వారికి కువైట్ లో 7 రోజుల జైలు శిక్ష అనంతరం తిరిగి పంపిస్తున్నారు. ఈ కొత్త తరహా మోసం గురించి కువైట్ ఎంబసీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు.