ఫింగర్ ప్రింట్స్ తో క్రిమినల్స్​కు చెక్

ఫింగర్ ప్రింట్స్ తో క్రిమినల్స్​కు చెక్

నేరాలు చేస్తారు. ఎవరికీ చిక్కకుండా తప్పించుకు తిరుగుతారు. సీన్ ఆఫ్ అఫెన్స్ లో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకుండా జాగ్రత్త పడతారు.అలాంటి నేరగాళ్లు చేసే చిన్న మిస్టేక్ పోలీసులకు పట్టిస్తుంది. అవే ‘ఫింగర్ ప్రింట్స్’.  పోలీస్ కేసుల దర్యాప్తులో కీలకంగా మారిన ఫింగర్ ప్రింట్స్ కి ఇప్పుడు టెక్నాలజీ తోడయ్యింది. దీంతో మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ళ దగ్గరి నుంచి పిక్ పాకెటర్స్, హంతకులు, మిస్సింగ్ కేసులను పోలీసులు ఛేదిస్తున్నారు. పోలీస్ రికార్డుల్లోకి ఎక్కిన దొంగలతో పాటు గుర్తు తెలియని డెడ్ బాడీల అడ్రస్ ట్రేస్ చేయడంలో ఫింగర్ ప్రింట్స్ కీ రోల్ పోషిస్తున్నాయి.

ఫింగర్ ప్రింట్స్ హిస్టరీ
1971లో మన సిటీలో ప్రారంభమైన ఫింగర్‌ప్రింట్‌యూనిట్‌ కొన్ని రోజులు మాన్యువల్‌గా కొనసాగినప్పటికీ 1999 తరువాత ఆటోమేటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సిస్టమ్ గా డెవలప్ అయ్యింది. అది ఇప్పుడు ఫారిన్ టెక్నాలజీతో రూపొందించిన ‘పాపిలాన్ హై ప్రిక్వేన్సీ’ ఫింగర్ ప్రింట్ సిస్టమ్ తో పోలీసులకు అందుబాటులో ఉంది. ఇందులో ఒక్కో టీమ్ లో ఇన్‌స్పెక్టర్‌,నలుగురు ఎస్సై స్థాయి అధికారులు విధులు నిర్వహిస్తుంటారు. వీళ్ళంతా తమ దగ్గరున్న ఫింగర్ ప్రింట్స్ ను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ డేటాలో అప్ లోడ్ చేయడంతో పాటు వివిధ కేసుల్లో పట్టుబడే నేరగాళ్ళ వేలి ముద్రలతో మ్యాచ్‌ చేసి చూస్తుంటారు. ఒకవేళ అవి మ్యాచ్ అయితే సంబంధిత పోలీస్ అధికారులను సమాచారం అందిస్తారు.

అందుకే అవి ప్రామాణికం
సాధారణంగా ఒకరికి ఉన్న ఫింగర్ ప్రింట్స్ మరొకరికి ఉండవు.  ప్రపంచంలో 4 రకాల ఫింగర్ ప్రింట్స్ కలిగిన వారే ఉంటారు. పుట్టిన దగ్గరి నుంచి చనిపోయే వరకు ఫింగర్ ప్రింట్స్ లో ఎలాంటి మార్పులుండవు. వేలిపై ఉన్న పొరలు చెరిగిపోయినా మళ్ళీ 15 రోజుల్లోనే యథాతథ రూపులోకి వస్తాయి. అందుకోసమే ఎక్కువగా సంతకాల కంటే ఫింగర్ ప్రింట్స్ నే ప్రామాణికంగా తీసుకుంటారు. కోర్టు కేసుల్లో కూడా ఫింగర్ ప్రింట్స్ అందించే సాక్ష్యాలు మాత్రమే నిజాలుగా నిలబడతాయి. అందుకోసం ఎలాంటి కేసులోనైనా సరే అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ పోలీసులు ముందుగా సేకరిస్తారు. సీన్ ఆఫ్ అఫెన్స్ లో లభించిన ఫింగర్ ప్రింట్స్ ను  పోలీస్ పాపిలాన్ డేటాలోని ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ చేసి చూస్తారు. దీంతో కేసు దర్యాప్తులో పురోగతి ఉంటుంది. నిందితుడు నేరం చేసిన వెంటనే తప్పించుకున్నా కొన్ని ఏళ్ల తర్వాతైనా ఫింగర్ ప్రింట్స్ తో పోలీసులకు చిక్కే అవకాశాలున్నాయి.

పాపిలాన్ తో ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్
కేసులను ట్రేస్ చేయడంలో రాష్ట్ర పోలీసులు హై టెక్నాలజీని వాడుతున్నారు. పాపిలాన్‌ ఆటోమేటిక్‌ ఫింగర్‌ఫ్రింట్‌ఐడెంటిఫికేషన్‌ సిస్టంతో కీలక కేసులను ఛేదిస్తునారు. అందుకోసం గతేడాది డిసెంబర్ వరకు 8,24,010 వేలిముద్రలను ఫింగర్ ప్రింట్ బ్యూరో డేటాలో పొందుపరిచారు. తమ దగ్గరున్న డేటాతో ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల 15 వరకు 32 మంది మోస్ట్ వాంటెడ్ నేరస్థులు,125 మంది పాతనేరస్థులను గుర్తించారు. మరో 20 గుర్తు తెలియని డెడ్ బాడీల అడ్రస్ తెలుసుకున్నారు. గతేడాది 354 మంది నేరస్థులను గుర్తించారు. మొబైల్ సెక్యూరిటీ డివైజ్ ద్వారా 6,832 మంది పాత నేరస్థులను గుర్తించి వారిపై నిఘా పెట్టారు. మరో 26 గుర్తు తెలియని డెడ్ బాడీలను ఫింగర్ ప్రింట్ మ్యాచింగ్స్ తో ఐడెంటిఫై చేశారు. 20,610 మంది క్రిమినల్స్ ఫింగర్ ప్రింట్ స్లిప్స్,ఫొటోలను లైవ్ డిజిటల్ స్కానర్లతో సేకరించారు. సిటీ కమిషనరేట్​పరిధిలో 2018 వరకు 76,979 మంది నేరస్థుల ఫింగర్​ప్రింట్స్​సేకరించారు. వీటిలో 2,220 మంది ఫింగర్​ప్రింట్స్​తో పాటు ఫొటోలను డేటాలో పొందుపరిచారు. 2018లో ఫింగర్​ప్రింట్స్​సాయంతో103 కేసులను ఐడెంటిఫై చేశారు. వీటిలో 35 కేసుల్లో 21 మంది నిందితులను గుర్తించారు.

ట్రేస్ చేసిన కేసులు..
ఈ ఏడాది మార్చి1న ఆటోనగర్ రోడ్ యాక్సిడెంట్ లో మృతి చెందిన మోహన్ గౌడ్(49)ను ఫింగర్ ప్రింట్ బ్యూరో గుర్తించింది.  కారు ఢీ కొనడంతో తీవ్రగాయాలపాలైన మోహన్ గౌడ్ ను హాస్పిటల్  తీసుకెళ్లేలోగా చనిపోయాడు. మృతుడి వివరాలు తెలియక పోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి కింద వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి ఫింగర్ ప్రింట్స్, కాలితొడలో కొంతభాగాన్ని సేకరించారు. వేలిముద్రలను ఫింగర్ ప్రింట్స్ బ్యూరోకి పంపించారు. దీంతో తమ దగ్గరున్న ఫింగర్ ప్రింట్ డేటా ఆధారంగా మృతి చెందిన వ్యక్తి1999లో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఓ కేసులో నిందితుడుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ సమాచారాన్ని వనస్థలిపురం పోలీసులకు ఫింగర్ ప్రింట్ బ్యూరో అందించింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన మిస్సింగ్ కేసు.. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి మోహన్ గౌడ్ గా గుర్తించారు. అయితే అప్పటికే 15 రోజులు గడవడంతో ఉస్మానియా మార్చురీలోనే మోహన్ గౌడ్ డెడ్ బాడీని సిబ్బంది దహనం చేశారు.

మరో కేసులో ఓ పాతనేరస్థుడిని ఫింగర్ ప్రింట్స్  పట్టించాయి. పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో వరుస చోరీలు చేసిన ఎస్.కె అల్తాఫ్ ను ఫింగర్ ప్రింట్స్ తో గుర్తించారు. ఫింగర్ ప్రింట్ డేటా ఆధారంగా పాతనేరస్థుల కోసం గాలించిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు..16 ఏళ్ల క్రైమ్ హిస్టరీ ఉన్న అల్తాఫ్ ను ఈ నెల 11న అరెస్ట్ చేశారు. 2003లో సంతోష్ నగర్ లో జరిగిన ఓ చోరీ కేసులో అల్తాఫ్ వేలిముద్రలు మ్యాచ్ కావడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీస్ దర్యాప్తులో మూడు కమిషనరేట్ల పరిధిలో అల్తాఫ్​ మొత్తం14 దొంగతనాలు చేసినట్లు తేలింది. ఇలాంటిదే 18 ఏళ్ల నాటి ఓ హత్య కేసును ఫింగర్ ప్రింట్స్ సాయంతో ఛేధించినట్లు అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ చైతన్యకుమార్ తెలిపారు.