తప్పుడు వార్త ఇచ్చిన్రు.. అందుకే ఆ జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్

తప్పుడు వార్త ఇచ్చిన్రు.. అందుకే ఆ జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్

అనారోగ్యానికి గురైన ఓ వృద్ధుడిని కుటుంబ సభ్యులు తోపుడుబండిపై తీసుకెళ్లి.. ఆసుపత్రికి తరలించిన ఘటనపై ఇటీవల స్థానిక జర్నిలిస్టులు ఓ వార్త ఇచ్చారు. అయితే ఆ వార్త ఇచ్చిన ముగ్గురు పాత్రికేయులపై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లా లహర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం... వారు ఇచ్చిన వార్త పూర్తిగా అబద్దం, ఆ వార్త నిజమనడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు.  జర్నలిస్టులు ఇచ్చిన సమాచారం తప్పని భావిస్తూ వారిపై ఐపీసీ సెక్షన్ 420,505(2)తో పాటు సెక్షన్ 66(ఎఫ్) లు నమోదయ్యాయి. 

మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆ జిల్లా మెజిస్ట్రేట్ సతీష్ కుమార్ దర్యాప్తుకు ఆదేశించారు. అనంతరం ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఆ కుటుంబం అసలు అంబులెన్సుకు ఎలాంటి ఫోనూ చేయలేదని, ఆ వార్తే నిజం కాదని చెప్పారు. వారికి ప్రభుత్వం తరపునుంచి అన్ని పథకాలూ అందుబాటులో ఉన్నాయన్న ఆయన.. తప్పుడు వార్త ఇచ్చి జర్నలిస్టులు అందర్నీ తప్పుదోవ పట్టించారన్నారు. అందుకే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు స్పష్టం చేశారు.