స్మృతి ఇరానీపై వ్యాఖ్యలు..కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ పై FIR

స్మృతి ఇరానీపై వ్యాఖ్యలు..కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ పై FIR

కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. సోన్ భద్ర జిల్లాలో ఐపీసీ సెక్షన్ 354ఎ, 501, 509 కింద రాయ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరో వైపు జాతీయ మహిళా కమిషన్ నుండి కూడా రాయ్ కి నోటీసు అందింది. డిసెంబర్ 28న రాయ్ విచారణకు హాజరుకావాలని ఎన్‭సీడబ్ల్యూ నోటీసుల్లో పేర్కొంది.

కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌గాంధీ ఈ సారి అమేథీ నుంచి పోటీ చేయడం లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని.. అజయ్‌ రాయ్‌ సోమవారం కొట్టిపారేశారు. అమేథీ స్థానం ఎప్పుడైనా గాంధీ కుటుంబాలదేనని ఆయన చెప్పారు. "స్మృతి ఇరానీ లాంటి వాళ్లు వస్తారు... లట్కే, జట్కే చేస్తారు, వెళ్లిపోతారు" అని అజయ్ రాయ్ వ్యాఖ్యానించారు.

అయితే అజయ్‌ రాయ్‌ చేసిన వ్యాఖ్యలను స్మృతి ఇరానీ తప్పుపట్టారు. లోక్‌సభలో ఆ వ్యాఖ్యలను ప్రస్తావించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కించపరిచేలా మాట్లాడినందుకు అజయ్‌ రాయ్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీ డిమాండ్‌పై అజయ్‌ రాయ్‌ స్పందించారు. ఆమెకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. లట్కే, జట్కే అంటే ఏదో ఒకటి చెప్తారు, చేస్తారు అని అర్థం అన్నారు. అందులో అనరాని మాటలు ఏమున్నాయని ఆయన ప్రశ్నించారు. తాను తప్పుడు మాటే మాట్లాడనప్పుడు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని అజయ్ రాయ్ పేర్కొన్నారు.