విజయవాడలో కరోనా ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

విజయవాడలో కరోనా ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

ఏపీలోని ఓ కరోనా హాస్పిటళ్లో అగ్నిప్రమాదం జరిగి 11 మంది మరణించారు. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో ప్యాలెస్ లో 40 మంది పేషంట్లు, 10 మంది వైద్య సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. రమేష్ హాస్పిటల్ ఈ ప్యాలెస్ ను లీజుకు తీసుకొని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తుంది. ఈ సెంటర్ లో 40 మంది కరోనా పేషంట్లు చికిత్స పొందుతున్నారు. పేషంట్లందరూ నిద్రమత్తులో ఉండగా.. ఒక్కసారిగా మంటలు రావడంతో.. అంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కొంతమంది పేషంట్లు బిల్డింగ్ పైనుంచి కిందికి దూకారు. మరి కొంతమంది అగ్నికి ఆహుతయ్యారు. కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్న శానిటైజర్ల వల్లే ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది.

మంటలను గమనించిన సిబ్బంది వెంటనే.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేసింది. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి రెస్య్యూ ఆపరేషన్ నిర్వహించారు. బాధితులను స్థానిక కరోనా హాస్పిటళ్లకు తరలించి వైద్యం అందిస్తున్నారు. హోటల్ సిబ్బంది ఫైర్ నిబంధనలన పాటించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

కరోనా బాధితులను కాపాడేందుకు పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి వెల్లంపల్లి, విజయవాడ సీపీ శ్రీనివాసులు ప్రమాదస్థలికి చేరుకున్నారు. దగ్గరుండి సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కూడా ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సీఎం జగన్ 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

For More News..

రాష్ట్రంలో మరో 1982 కరోనా కేసులు

సగం సంక్షేమ హాస్టళ్లు.. కిరాయి బిల్డింగుల్లోనే

కరోనా కష్టాలతో గోల్డ్ అమ్ముకుంటున్నరు