
మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్దకొమటిపల్లి శివారులో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు మంద తిరుపతిరెడ్డి నాలుగు ఎకరాలలో జామాయిల్ పంట సాగుచేశాడు. ఆదివారం అదే గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలో చెత్తను కాల్చివేయగా, అక్కడ నుంచి నిప్పురవ్వలు గాలికి వచ్చి జామాయిల్పంట, మరో రైతు మంద సంజీవరెడ్డికి చెందిన వడ్ల కుప్పపై పడడంతో పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
స్థానికులు గమనించి పరకాల ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పి వేసింది. విషయం తెలుసుకున్న ఎస్సై అశోక్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కాగా, అగ్ని ప్రమాదంలో సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.