సికింద్రాబాద్ నవకేతన్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్ నవకేతన్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం
  • కరెంట్, ఇంటర్నెట్ కేబుల్స్ వద్ద షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు
  • భయాందోళనతో బయటికి పరుగులు తీసిన ఉద్యోగులు 

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ లోని నవకేతన్ కాంప్లెక్స్​లో  అగ్ని ప్రమాదం జరిగింది. కాంప్లెక్స్ నిర్వాహకులు, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది.  బుధవారం రాత్రి సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలోని నవకేతన్ కాంప్లెక్స్ సెల్లార్ లో ఉండే కరెంట్, ఇంటర్నెట్ కేబుల్స్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున కేబుల్స్ ఉండటంతో వాటికి మంటలు అంటుకుని కాంప్లెక్స్ అంతటా దట్టమైన పొగ అలుముకుంది.

సమాచారం అందుకున్న  ఫైర్ సిబ్బంది, డీఆర్ఎఫ్ టీమ్,  మోండా మార్కెట్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కాంప్లెక్స్ లోని ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులను బయటికి పంపించారు.  అయితే, కేబుల్ వైర్లు సెల్లార్ నుంచి 8వ అంతస్తు వరకు ఉండటంతో మంటలు 3వ అంతస్తు దాకా వ్యాపించాయి. కేబుల్ వైర్లు బాల్కనీ మీదుగా ఉండటంతో ఆఫీసుల్లోకి మంటలు వ్యాపించలేదు. బాల్కనీ మీదుగా మాత్రమే మంటలు చెలరేగాయి. పైర్ సిబ్బంది వెంటనే మంటలను 4 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.

కాంప్లెక్స్ లోని 8వ అంతస్తు వరకు ఉన్న అన్ని ఆఫీసులు, సెల్లార్ ను పరిశీలించానమి.. కేబుల్స్ కు తప్ప మిగతా సామగ్రికి మంటలు అంటుకోలేదని డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి తెలిపారు. బల్దియా ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్​రెడ్డి, మోండా మార్కెట్, మహంకాళి, రాంగోపాల్ పేట ఇన్ స్పెక్టర్లు రామకృష్ణ, పరశురాం, లింగేశ్వర్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.