ఫైర్​ యాక్సిడెంట్ల నివారణ కమిటీ ఏమాయె?

ఫైర్​ యాక్సిడెంట్ల నివారణ కమిటీ ఏమాయె?
  • అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడే బల్దియా హడావుడి
  • అవేర్​నెస్ ప్రోగ్రామ్స్​తోనే సరిపెడుతున్న అధికారులు
  • ఫైర్ సేఫ్టీ లేని బిల్డింగ్​లు, గోడౌన్లపై చర్యల్లేవ్ 

హైదరాబాద్, వెలుగు: సిటీలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా పకడ్బందీ చర్యలు తీసుకోవడంలో బల్దియా విఫలమవుతోంది. చర్యలు తీసుంటామని చెప్తున్న మంత్రులు, ఉన్నతాధికారులు  పట్టించుకోవడం లేదు.  ఏడాది వ్యవధిలో  సికింద్రాబాద్​లో మూడు పెద్ద ఫైర్ యాక్సిడెంట్లు జరిగాయి. ఆ మూడు చోట్ల 22 మంది మృతి చెందారు.  జనవరిలో నల్లగుట్టలోని డెక్కన్ మాల్​లో భారీ అగ్ని ప్రమాదం తర్వాత హడావుడి చేసిన ప్రజాప్రతినిధులు, బల్దియా అధికారులు తర్వాత నివారణపై ఫోకస్ పెట్టలేదు. నల్లగుట్ట ప్రమాదం తర్వాత సిటీలో దాదాపు పదికి పైగా  అగ్ని ప్రమాదాలు జరిగాయి.

ప్రాణనష్టం జరగకపోయినా ఆస్తినష్టం వాటిల్లింది. కానీ వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.  ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పర్యటించే మంత్రులు, ఉన్నతాధికారులు చెప్పే మాట ఒక్కటే.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని. డెక్కన్ మాల్​లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం సమయంలోనూ ఇవే మాటలు చెప్పారు. ఫైర్ ​యాక్సిడెంట్ల నివారణకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. రెండు మీటింగ్​లు ఏర్పాటు చేసి హడావుడి చేసిన అధికారులు ఈవీడీఎం(ఎన్​ఫోర్స్​మెంట్ అండ్ విజిలెన్స్) ఆధ్వర్యంలో కేవలం అవేర్​నెస్​ప్రోగ్రామ్స్​తో మాత్రమే నిర్వహించారు. ఎన్ని గోడౌన్లు ఉన్నాయి? ఎక్కడెక్కడ ప్రమాదకరంగా ఉన్నాయన్న వాటిపై బల్దియా కనీసం ఆరా తీయలేదు. చర్యలు లేకపోవడంతో ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి.

కలవరపెడుతున్న ప్రమాదాలు..

గతేడాది మార్చి23న బోయగూడలోని ఓ టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది చనిపోయారు. సికింద్రాబాద్​లోని రూబీ లాడ్జిలో సెప్టెంబర్ 12న ఫైర్ ​యాక్సిడెంట్ జరిగి 8 మంది ప్రాణాలు పోయాయి. ఆ తర్వాత 4 నెలల్లోనే మరో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఏడాది జనవరి 29న  మినిస్టర్ రోడ్డులోని నల్లగుట్ట పరిధి డెక్కన్ మాల్​లో  మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనమయ్యారు. రెసిడెన్షియల్ పర్పస్​లో కేవలం రెండు 
ఫ్లోర్లకు మాత్రమే బల్దియా వద్ద అనుమతి పొందారు. కానీ ఇల్లీగల్​గా స్పోర్ట్స్ మెటీరియల్ గోడౌన్​ కోసం వాడారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు కూడా కమిటీ వేసి మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని, ముందుగా రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఉన్న గోడౌన్లను ఖాళీ చేయిస్తామని అధికారులు చెప్పారు. కానీ చర్యలు మాత్రం తీసుకోలేదు. 

సర్వే రిపోర్టు రాలే!

ప్రమాదాలు జరిగిన సమయంలో అన్ని వివరాలు సేకరించి సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని నేతలు, అధికారులు హడావుడి చేశారు. గోడౌన్లపై సర్వే చేసి మరీ రిపోర్టు అందివ్వాలని అప్పట్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత రిపోర్టు రాలేదు. చర్యలు తీసుకోలేదు. కనీసం వరుసగా అగ్ని ప్రమాదాలు జరిగిన సికింద్రాబాద్ జోన్​లోనైనా చర్యలు చేపట్టలేదు. రెసిడెన్షియల్ బిల్డింగ్​లను కమర్షియల్ పర్పస్​లో వాడుతున్నట్లు అధికారుల దృష్టికి వస్తున్నా చర్యలు తీసుకోవట్లేదు. అనుమతులు ఇచ్చే సమయంలో కూడా పెద్దగా పట్టించుకోకుండా పర్మిషన్లు ఇస్తుండటంతో.. ఇదే అదునుగా వాటిపై మరిన్ని ఫ్లోర్లను నిర్మిస్తున్నారు. ఆ తర్వాత ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. 

పన్నులపైనే జీహెచ్ఎంసీ ఫోకస్

నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఆ బిల్డింగ్​ని ఎలా వాడుతున్నారనే విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదు. బిల్డింగ్​కు సంబంధించిన ప్రాప్టర్టీ ట్యాక్స్​ క్లియర్​గా ఉందా? లేదా అని మాత్రమేచూస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్​ల కోసం పలుమార్లు తిరుగుతున్నప్పటికీ ఆ బిల్డింగ్ వాడకంపై మాత్రం దృష్టి పెట్టట్లేదు. నిర్మాణాలు జరుపుతున్న వారు కూడా ఫైర్ సేఫ్టీని పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ వారికి ఎన్​వోసీలు జారీ చేస్తున్నారు. అడ్డగోలుగా పర్మిషన్లు​ఇస్తున్నందుకే ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, కనీసం ట్రేడ్ లైసెన్సులు కూడా ఉండటంలేదని బల్దియా కౌన్సిల్​సమావేశాల్లో కార్పొరేటర్లు నిలదీస్తున్నారు. అధికారులు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరిన్ని ప్రమాదాలు జరగొచ్చని.. పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.