- తెలంగాణ కాంట్రాక్టర్ల 12వ వార్షికోత్సవ మహాసభలో సీఈఐజీ నందకుమార్
హైదరాబాద్, వెలుగు: నాణ్యత లేని పరికరాల వినియోగంతోనే అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయని చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (సీఈఐజీ) సీహెచ్‌కే నందకుమార్ అన్నారు. తెలంగాణ కాంట్రాక్టర్ల 12వ వార్షికోత్సవ మహాసభలో 2026 క్యాలెండర్, డైరీని ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. ఫైర్ ఆడిట్ నిర్వహించకపోవడంతో పాటు మానవ తప్పిదాలు కూడా అగ్ని ప్రమాదాలకు కారణం అవుతున్నాయని పేర్కొన్నారు.
మంటలు ఆర్పే ఫైర్ ఎక్సాష్టర్స్ వంటి పరికరాలు ఏర్పాటు చేయకపోవడంతో మంటలు అదుపు చేయడంలో అలస్యమై భారీ ఆస్తి నష్టం వాటిల్లుతోందని చెప్పారు. ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే నాణ్యమైన పరికరాలనే వినియోగించాలని సూచించారు.
విద్యుత్ మరమ్మతులు క్వాలిఫైడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్‌తో మాత్రమే చేయించాలన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు జీసీరెడ్డి, లైసెన్సింగ్ బోర్డు మాజీ సభ్యుడు నక్క యాదగిరి మాట్లాడుతూ, ఎర్తింగ్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ గౌడ్, జాయింట్‌సెక్రటరీ నామిని వెంకటేష్ నేత, వైస్ ప్రెసిడెంట్ మహేందర్, పెద్ద పుల్లారావు, మస్తాన్, రాష్ట్ర నాయకులు కె.శ్రీనివాస్, ఎం.వెంకటేశ్, రాజు మహారాజ్ పాల్గొన్నారు.
