లక్నో: 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సుకు మంటలు అంటుకున్నాయి. అదృష్టవశాత్తు ప్రయాణికుంలదరూ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఆగ్రా–లక్నో ఎక్స్ ప్రెస్ వేలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఎక్స్ ప్రెస్ వేలో టోల్ ప్లాజాకు 500 మీటర్ల ముందు బస్సు వెళ్తుండగా.. ఓ చక్రంలో మంటలు ప్రారంభమయ్యాయి.
గమనించిన డ్రైవర్.. వెంటనే అందరినీ అలర్ట్ చేశాడు. దీంతో ప్రయాణికులందరూ బస్సు నుంచి కిందికి దిగారు. తర్వాత బస్సు మొత్తం అగ్నికీలలు వ్యాపించిపోయాయి. క్షణాల్లోనే బస్సు అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
బస్సును రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. బస్సు ఓనర్ వేరే వెహికల్ ఏర్పాటు చేసి ప్రయాణికులను తరలించాడు. అయితే, మంటలు చెలరేగడానికి కారణం తెలియదని డ్రైవర్ తెలిపాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
