
గండిపేట, వెలుగు : ఫర్నిచర్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం జరిగి పక్కనే సోఫా తయారీ కంపెనీకి మంటలు వ్యాపించగా.. సామగ్రి కాలిపోయింది. ఈ ఘటన అత్తాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సులేమాన్ నగర్ పరిధి ఎంఎం పహాడీలోని కట్టెల గోడౌన్ లో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి.
క్రమంగా మంటలు పక్కనే ఉన్న సోఫా తయారీ కంపెనీకి వ్యాపించాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అప్పటికే కట్టెల గోడౌన్, సోఫా తయారీ కంపెనీలోని సామగ్రి కాలిపోయింది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.