అంకుర హాస్పిటల్ బిల్డింగ్​లో మంటలు

అంకుర హాస్పిటల్ బిల్డింగ్​లో మంటలు
  • గుడిమల్కాపూర్ బ్రాంచ్ హోర్డింగ్​లో షార్ట్ సర్క్యూట్​తో అంటుకున్న ఫ్లెక్సీలు
  • పేషెంట్లకు, స్టాఫ్​కు తప్పిన ప్రాణాపాయం   

 హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, గుడిమల్కాపూర్‌‌‌‌‌‌‌‌లోని అంకుర హాస్పిటల్ బిల్డింగ్ లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బిల్డింగ్ టెర్రస్ పై ఏర్పాటు చేసిన హోర్డింగ్ లో షార్ట్ సర్క్యూట్ అయి భారీగా మంటలు చెలరేగాయి. అయితే, మంటలు బిల్డింగ్ బయటివైపునే వ్యాపించడం, పోలీసులు, స్టాఫ్ కలిసి వెంటనే పేషెంట్లను బయటకు తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పింది. పీవీ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ వే పిల్లర్ నంబర్ 68 వద్ద ఉన్న 9 అంతస్తుల కోహినూర్  బిల్డింగ్‌‌‌‌లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ వరకూ అంకుర చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉంది. ఆపై ఉన్న ఫ్లోర్లలో రెనోవేషన్ పనులు జరుగుతుండటంతో ఖాళీగా ఉంది. శనివారం సాయంత్రం 5.40 గంటల సమయంలో బిల్డింగ్‌‌‌‌ పై భాగంలో ఉన్న హోర్డింగ్‌‌‌‌లో షార్ట్‌‌‌‌ సర్య్కూట్‌‌‌‌అయ్యింది. ఒక్కసారిగా హోర్డింగ్‌‌‌‌ ఫ్లెక్సీకి మంటలు అంటుకున్నాయి. కాలుతున్న ఫ్లెక్సీ మెటీరియల్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌లోని తొమ్మిది అంతస్తుల బయటి భాగం నుంచి కిందకి పడింది. దీంతో భారీగా మంటలు పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేశారు. హాస్పిటల్ లో చిక్కుకుపోయిన 30 మంది పేషెంట్లు, వారి బంధువులను పోలీసుల సాయంతో సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న పలువురు పేషెంట్లను వేరే ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదం నుంచి అందరూ సేఫ్ గా బయటపడటంతో స్టాఫ్, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, బిల్డింగ్ లో ఫైర్ సేఫ్టీ సరిగ్గా లేదని, అసలు సరైన అనుమతులు ఉన్నాయా? లేవా? అని స్థానికులు అనుమానాలు వ్యక్తంచేశారు. కార్వాన్, నాంపల్లి ఎమ్మెల్యేలు కౌసర్ మొయినుద్దీన్, మాజీద్ హుస్సేన్ లు ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.