మూడు ఇండ్లకు అంటుకున్న నిప్పు.. అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన వస్తువులు

మూడు ఇండ్లకు అంటుకున్న నిప్పు.. అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన వస్తువులు
  • అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన వస్తువులు
  • రూ.9.5 లక్షల ఆస్తి  నష్టం

పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని మల్లెమోనిగూడ గ్రామంలో వరుసగా మూడు ఇండ్లలో అగ్ని ప్రమాదం  జరిగింది. మల్లెమోనిగూడ గ్రామానికి చెందిన రసూల్​ బీ, బషీర్ ​బీ, ఎండీ.మౌలానాకు చెందిన ఇండ్లు పక్కపక్కన ఉన్నాయి. బుధవారం ఇంట్లోని వ్యక్తులంతా పొలం పనులకు వెళ్లారు. ఈ సమయంలో మూడు ఇండ్లలో మంటలు చెలరేగి వస్తువులు దగ్ధమయ్యాయి. మంటలు వ్యాపించడం గమనించిన గ్రామస్తులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

వారు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అప్పటికే మూడు ఇండ్లలో రెండు మేకలు, 9 బియ్యం బస్తాలు, కూలర్​, వాషింగ్​ మెషీన్, ఇంటి డాక్యుమెంట్లు, సీలింగ్​ ఫ్యాన్లు, దుస్తులు, నిత్యాసర వస్తువులు కాలి బూడిదయ్యాయి. సుమారు 9.5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు.