నాకే టికెట్ ! ..కామారెడ్డి జిల్లాలో ప్రచారం చేసుకుంటున్న కొందరు ఆశావహులు

నాకే టికెట్ ! ..కామారెడ్డి జిల్లాలో ప్రచారం చేసుకుంటున్న కొందరు ఆశావహులు
  •   వార్డుల్లో తిరుగుతూ మద్దతు కూడగట్టుకునే పనిలో నిమగ్నం
  •     పార్టీ టికెట్ దక్కకుంటే ఇండిపెండెంట్​గా పోటీకి సై
  •     కామారెడ్డి మున్సిపాలిటీలో ఎన్నికల హడావుడి

కామారెడ్డి, వెలుగు :  మున్సిపల్​ ఎన్నికల షెడ్యూల్​రాకముందే కామారెడ్డి జిల్లాలో రాజకీయం వెడేక్కుతోంది. టికెట్​నాకే పక్కా అంటూ కొందరు ఆశావహులు ప్రచారం చేసుకుంటున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని కొందరు నేతలు పార్టీ టికెట్‌‌‌‌ ఖరారైందంటూ సోషల్‌‌‌‌ మీడియాలో పోస్ట్​లు పెడుతున్నారు. కామారెడ్డి మున్సిపల్​లో కొందరు ఆశావహులు వార్డుల్లో తిరుగుతూ మద్దతు కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కొందరైతే పార్టీ టికెట్​ దక్కకుంటే ఇండిపెండెంట్​గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు..

కామారెడ్డి జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డులు, బాన్సువాడలో 19, ఎల్లారెడ్డిలో 12, బిచ్‌‌‌‌కుందలో 12 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. త్వరలో ఎన్నికల షెడ్యూల్‌‌‌‌ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీ నేతలు పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహరచనలు చేస్తున్నారు. 

అభ్యర్థుల కోసం అన్వేషణ..

ప్రధాన పార్టీల అధిష్టానాలు బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో కొన్ని వార్డుల్లో టికెట్ల కోసం కాంగ్రెస్‌‌‌‌, బీజేపీ, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ల్లో పోటీ ఎక్కువగా ఉండగా, మరికొన్ని వార్డుల్లో సరైన అభ్యర్థులు లేకపోవడంతో ఆర్థికంగా పలుకుబడి ఉన్న వ్యక్తుల కోసం వెదుకుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి టికెట్‌‌‌‌ ఇస్తామంటూ ప్రోత్సహిస్తున్నాయి. ఇటీవల పలువురు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారిన విషయం తెలిసిందే. మెజారిటీ కౌన్సిల్‌‌‌‌ స్థానాలు గెలుచుకొని మున్సిపల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ పదవిని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ప్రధాన పార్టీలు అడుగులు వేస్తున్నాయి. 

ఆశావహుల వ్యూహాలు..

మున్సిపల్​వార్డుల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు.  టికెట్‌‌‌‌ ఖరారు కాకముందే పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తామే అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకుంటున్నారు.  ప్రధాన పార్టీల నుంచి టికెట్‌‌‌‌ రాకపోతే ఇండిపెండెంట్‌‌‌‌గా లేదా ఇతర పార్టీల నుంచి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. జనరల్‌‌‌‌ వార్డుల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. 

కొత్త టౌన్‌‌‌‌, దేవునిపల్లి, లింగాపూర్‌‌‌‌ ప్రాంతాల్లోని వార్డుల్లో టికెట్ల కోసం డిమాండ్‌‌‌‌ ఎక్కువగా కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్‌‌‌‌ ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మిగిలిన పార్టీలూ అన్ని వార్డుల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.