న్యూఢిల్లీ: ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ఎయిర్పోర్ట్లో మంగళవారం మధ్యాహ్నం ఓ బస్సులో మంటలు చెలరేగాయి. టెర్మినల్ 3 వద్ద ఎయిర్ ఇండియా విమానానికి అతి దగ్గరగా నిలిపి ఉన్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ బస్సు విమానయాన సంస్థలకు గ్రౌండ్ సర్వీసులను అందించే థర్డ్-పార్టీ ప్రొవైడర్ సాట్స్ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందింది. ఫైర్‌ఫైటింగ్ టీం వెంటనే స్పాట్‌కు చేరుకొని రెండు నిమిషాల్లోనే మంటలను ఆర్పిందని అధికారులు తెలిపారు.
ఆ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. ‘‘సంఘటన జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అన్ని కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయి. మా ప్రయాణికులు, సిబ్బంది భద్రత మాకు చాలా ముఖ్యం” అని ఢిల్లీ విమానాశ్రయం అధికారులు తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలను సాట్స్పరిశీలిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. షార్ట్ సర్క్కూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఢిల్లీ విమానాశ్రయంలో మొత్తం మూడు టెర్మినల్స్, నాలుగు రన్‌వేలు ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద టెర్మినల్స్‌లో ఒకటైన మూడో నంబర్టెర్మినల్ను 2010లో ప్రారంభించారు.
