
యశ్వంత్‌పూర్-టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలులోని వంటచేసే బోగీలో(ప్యాంట్రీ కార్) మంగళవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. మంటలను గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయడపడ్డారు. ప్రమాదం జరగడంతో రెండు గంటలుగా రైలు పట్టాలపైనే నిలిచిపోయింది. అయితే.. అగ్ని ప్రమాదం జరిగిన బోగీని.. ఇతర బోగీలతో వేరు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇందులో ఓ బోగీ పూర్తిగా కాలిపోయింది.
గొల్లప్రోలు స్టేషన్ దగ్గర రెండు రైల్వే లైన్లు మాత్రమే ఉండటంతో.. ప్రస్తుతం ఒకే లైన్ ద్వారా రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ప్రమాదం జరిగిన లైన్‌లో కూడా రైళ్ల రాకపోకలను పునద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.