పటాకుల రేట్లు పేలుతున్నయ్!.. దీపావళికి ముందే భారీగా పెరిగిన రేట్లు

పటాకుల రేట్లు పేలుతున్నయ్!..  దీపావళికి ముందే భారీగా పెరిగిన రేట్లు
  • గతేడాదితో పోల్చితే 50 శాతం పెంచేసిన వ్యాపారులు  
  •     ఎన్నికలు, పెండ్లిళ్ల నేపథ్యంలో భారీగా కొనుగోలు  
  •     పండగకు సామాన్యులపై ధరల భారం తప్పదు

హైదరాబాద్,వెలుగు : దీపావళి రాక ముందే పటాకుల ధరలు పేలుతున్నాయి. మరోవైపు అమ్మకాలు భారీగా కొనసాగుతున్నాయి. ఒక పక్క ఎన్నికలు, మరో పక్క పెండ్లిళ్ల నేపథ్యంలో సిటీలో పటాకుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పెరిగిన డిమాండ్​ కారణంగా వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచి అమ్ముతున్నారు. గతేడాదికంటే ఈసారి దాదాపు 50 శాతం ధరలు పెంచేశారు. పండగ ముందు మరింత పెంచేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారు.  

వేడుకలు, రాజకీయ కార్యక్రమాలు, నేతల ఊరేగింపుల సందర్భంగా పటాకులు పేల్చి హంగామా చేస్తుంటారు. పైగా ఇప్పుడు ఎన్నికల రావడం, ఈ సీజన్​లో పెండ్లిళ్లు భారీ సంఖ్యలో ఉండటంతో  పలువురు రాజకీయ నేతలు, పెళ్లి సంబరాలు నిర్వహించుకునే వారు భారీ మొత్తంలో పటాకులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో సిటీలోని ప్రధాన హోల్​సేల్​ మార్కెట్లయిన బేగంబజార్, మలక్​పేట మార్కెట్​, సికింద్రాబాద్, శివారు ప్రాంతాల్లోని హోల్​సేల్​ క్రాకర్స్ షాప్​లు కస్టమర్లతో రద్దీగా కనిపిస్తున్నాయి. ప్రతి ఏడాది బేగంబజార్ ​హోల్​సేల్​మార్కెట్​లో రోజుకు 150 నుంచి 200 కోట్ల బిజినెస్ జరుగుతుందని వ్యాపారులు తెలిపారు.  

భారీ డిమాండ్ కారణంగానే..

గతేడాది దీపావళికి మాత్రమే వ్యాపారులు పటాకులను దిగుమతి చేసుకోగా.. ఈసారి ఎన్నికలు, పెళ్లిళ్లు తోడవడంతో రెట్టింపు సరుకును తెప్పించుకుని స్టాక్ పెట్టుకున్నారు. డిమాండ్​ను బట్టి పటాకుల ధరలు కూడా పెంచి అమ్ముతున్నారు. గత శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నామినేషన్లను స్వీకరిస్తున్నారు. దీంతో నేతలు, కార్యకర్తలు ర్యాలీలతో హంగామా చేస్తూ.. భారీగా పటాకులు కాలుస్తున్నారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నవంబరులో లక్షకు పైగానే పెండ్లిళ్లు ఉన్నాయి. దీంతో బారాత్​ఊరేగింపుల్లో పటాకులు కాలుస్తుంటారు. పటాకుల ధరలను చూస్తే.. గతేడాదికంటే 50 శాతం పెరిగినట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు. పెరిగిన డిమాండ్​ను దృష్టిలో ఉంచుకుని సరుకు దిగుమతి చేసుకుంటున్నామంటున్నారు. ప్రధానంగా నేషనల్, అయ్యన్, స్టాండర్డ్​ వంటి కంపెనీలకు చెందిన ఉత్పత్తులకు మార్కెట్​లో అధిక డిమాండ్​ ఉంది. తమిళనాడులోని శివకాశి నుంచి పెద్దమొత్తంలో హైదరాబాద్​కు పటాకులు దిగుమతి అవుతున్నాయి. 

ఇష్టారాజ్యంగా ధరల పెంపు

ఈసారి అసెంబ్లీ ఎన్నికలు, పెద్ద సంఖ్యలో పెళ్లిళ్ల నేపథ్యంలో పటాకుల వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశారు. కాగా.. పెట్రోల్,డీజిల్​ ధరల పెరుగుదల, నిర్వహణ వ్యయం, ట్యాక్స్​లు  పెరిగిన దృష్ట్యానే పటాకుల ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీని ప్రభావం దీపావళి పండగపై కూడా పడే అవకాశం ఉందని అంటున్నారు. 

పటాకుల్లో ప్రత్యేకతలు

ఈసారి పటాకుల్లో పలు ప్రత్యేకతలు ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. చిచ్చుబుడ్లు, భూ చక్రాలు, లక్ష్మీబాంబు, వంకాయ  బాంబులు, తారాజువ్వలు, లడీలు, ఉల్లిగడ్డ బాంబులు, హండ్రెడ్ ​వాలా, థౌజెండ్​వాలా, టెన్​ థౌజెండ్ ​వాలా లాంటి వాటితో పాటు లేటెస్ట్​గా నాగబాంబు, ఫ్లవర్​ ప్యాకెట్, కెనాన్​బాల్స్​, 24 షాట్స్​, చక్కర్స్​, క్లిప్పర్​–60 మల్టీ కలర్, రోబో జెల్లీ, లాడర్​, ఫర్బీ, సెల్పీ 100 షాట్స్​, బ్లాక్​షాట్స్​, కోకోనట్​ షాట్​ వంటి రకరకాల పటాకులు మార్కెట్​లో అందుబాటులో ఉన్నాయి. ఫ్యాన్సీ క్రాకర్స్ కాల్చగానే ఆకాశంలో రంగు రంగుల వెలుగులు విరజిమ్మేవి, షాట్స్​అంటే ఆకాశంలోకి వెళ్లి పేలేవి అధికంగా ఉన్నాయని  వ్యాపారులు చెబుతున్నారు.