రాత్రి 8 నుంచి 10 లోపే క్రాకర్స్ పేల్చాలి.. దీపావళి వేళ కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

 రాత్రి 8 నుంచి 10 లోపే క్రాకర్స్ పేల్చాలి.. దీపావళి వేళ కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

దీపావళి సందర్భంగా కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళికి పటాకులు కాల్చాలనుకునే వారికి షరతులు విధించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల లోపు వరకు మాత్రమే పటాకులు పేల్చాలని సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ మధ్యే అత్తిబెలెలోని ఓ క్రాకర్ గోడౌన్ లో ప్రమాదం జరిగిన తర్వాత కర్నాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రమాదంలో దాదాపు 17 మంది వరకు చనిపోయిన విషయం తెలిసిందే. పర్యావరణానికి హాని కల్గించని క్రాకర్స్ ను మాత్రమే అమ్మాలని కర్నాటకలోని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. పర్యావరణానికి హాని కల్గించని క్రాకర్స్ ను అమ్మాలని, వాటిపై ఆకుపచ్చ అని రాసి ఉన్న వాటిని విక్రయించాలని చెప్పింది.

కర్నాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (కేఎస్‌పీసీబీ) జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పటాకులు పేల్చేందుకు రెండు గంటల నిబంధనను అమలు చేయాలని పురపాలక శాఖ అధికారులు, పౌర సంస్థలు, కార్పొరేషన్‌లను ఆదేశించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని చెప్పింది. గాలి కాలుష్యం కాకుండా చూడాలని సూచించింది. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్‌ గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

దేశవ్యాప్తంగా నాన్-గ్రీన్ పటాకులను నిషేధిస్తూ అక్టోబర్ 2018 నుండి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహరణగా చూపించింది సిద్ధరామయ్య సర్కార్. క్రాకర్స్ పేల్చడానికి నిర్దిష్ట సమయాలను (రాత్రి 8 నుండి 10 గంటల వరకు) సూచించింది. పాఠశాలలు, ఆసుపత్రుల దగ్గర క్రాకర్స్ అమ్మడం లేదా పేల్చడం చేయవద్దని చెప్పింది.