తెలంగాణలో తొలి క‌రోనా మృతి: 65కు చేరిన కేసుల సంఖ్య‌

తెలంగాణలో తొలి క‌రోనా మృతి: 65కు చేరిన కేసుల సంఖ్య‌

తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 65కు చేరింద‌ని, ఇవాళ ఒక్క రోజే ఆరు కేసులు పెరిగాయ‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద్ర తెలిపారు. రాష్ట్రంలో నిన్న, ఇవాళ భారీగా కేసులు పెరిగాయ‌న్నారు. నిన్న‌ కుత్బుల్లాపూర్ లో ఒకే కుటుంబంలో న‌లుగురికి, ఇవాళ ఒక్క రోజులో పాత బ‌స్తీలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురుకి క‌రోనా సోకింద‌ని తెలిపారు. ఓ వ్య‌క్తి మ‌ర‌ణించిన త‌ర్వాత క‌రోనా ఉన్న‌ట్లు తేలింద‌ని చెప్పారు. శ‌నివారం సాయంత్రం మంత్రి ఈట‌ల మీడియాతో మాట్లాడారు.

 

హైద‌రాబాద్ గ్లోబ‌ల్ హాస్పిట‌ల్ లో 74 ఏళ్ల వృద్దుడు ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో అడ్మిట్ అయ్యాడ‌ని, అక్క‌డ చికిత్స పొందుతుండ‌గా.. నిమోనియా వ‌చ్చింద‌ని, అతి తీవ్రం కావ‌డంతో మ‌ర‌ణించాడ‌ని చెప్పారు. ఆ వ్య‌క్తి మ‌ర‌ణించిన త‌ర్వాత ఆస్ప‌త్రి సిబ్బందికి అనుమానం వ‌చ్చి డెడ్ బాడీని గాంధీకి త‌ర‌లించార‌ని, అక్క‌డ టెస్టు చేయ‌గా.. క‌రోనా కార‌ణంగానే చ‌నిపోయిన‌ట్లు తేలంద‌ని వివ‌రించారు మంత్రి ఈట‌ల‌. చ‌నిపోయిన వ్య‌క్తితో క‌లిపి మొత్తం కేసుల సంఖ్య 65కు చేరింద‌ని చెప్పారు.

ఇప్ప‌టికే చికిత్స పొందుతున్న వారిలో ప‌ది మంది కోలుకున్నార‌ని, టెస్టుల్లో నెగ‌టివ్ వ‌చ్చింద‌ని చెప్పారు మంత్రి. ఒక‌టి రెండ్రోజుల్లో వాళ్ల‌ను డిశ్చార్జ్ చేస్తామ‌ని తెలిపారు. క‌రోనా నియంత్ర‌ణ‌పై ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉంద‌ని, ప్ర‌జ‌లెవ‌రూ ఆందోళ‌న చెందాల్సింది లేద‌ని చెప్పారు. హైద‌రాబాద్ లో ఎక్క‌డా రెడ్ జోన్లు లేవ‌న్నారు.