మణిపూర్ ఘటనపై దద్దరిల్లిన పార్లమెంట్

మణిపూర్ ఘటనపై దద్దరిల్లిన పార్లమెంట్

న్యూఢిల్లీ:  వర్షాకాల సమావేశాల మొదటి రోజే పార్లమెంట్ దద్దరిల్లింది. మణిపూర్ లో హింసపై ప్రధాని మోదీ స్టేట్ మెంట్ ఇవ్వాలని, ఆ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడంతో అట్టుడికింది. చివరకు ఎలాంటి చర్చ లేకుండానే ఉభయసభలు వాయిదా పడ్డాయి. గురువారం సమావేశాలు ప్రారంభమైనంక ఇటు లోక్ సభ, అటు రాజ్యసభ రెండింటిలోనూ ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. ‘మణిపూర్.. మణిపూర్’, ‘మణిపూర్ మండిపోతున్నది’ అంటూ నినాదాలు చేశాయి. రాష్ట్రంలో పరిస్థితిపై చర్చకు అనుమతించాలని నోటీసులు ఇచ్చాయి. మిగతా అంశాలు పక్కనపెట్టి, మణిపూర్ ఇష్యూపై చర్చ మొదలుపెట్టాలని డిమాండ్ చేశాయి. అయితే చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తామని అధికార పార్టీ చేసిన ప్రకటనను ప్రతిపక్షాలు పట్టించుకోలేదు. ఆందోళనలు కొనసాగించడంతో రెండు సభలను శుక్రవారానికి వాయిదా వేశారు.  

రెండు సభల్లోనూ అంతే.. 

రాజ్యసభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా.. ఇటీవల మృతి చెందిన బీజేపీ ఎంపీ హరద్వార్ దూబేకు నివాళి అర్పించారు. అనంతరం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభం కాగానే మణిపూర్ పై చర్చకు అనుమతించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సహా 8 మంది ప్రతిపక్ష నేతలు రూల్ 267 కింద చైర్మన్ కు నోటీసులు ఇచ్చారు. మిగతా అంశాలన్నీ పక్కనపెట్టి, వెంటనే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతల ఆందోళనలతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైనంక ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ సినిమాటోగ్రఫీ అమెండమెంట్ బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ టైమ్ లో ప్రతిపక్ష నేతలు ఆందోళనలు మొదలుపెట్టారు. తాము ఉదయం నుంచి అడుగుతున్నా, మణిపూర్ పై ఎందుకు చర్చకు అనుమతించడం లేదని ఖర్గే ప్రశ్నించారు. బయట మాట్లాడుతున్న ప్రధాని మోదీ.. సభలో ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు. 

ప్రతిపక్ష నేతల నిరసనలు ఆగకపోవడంతో చైర్మన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. కాగా, రాజ్యసభ పక్ష నేత పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. మణిపూర్ అంశంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రతిపక్షాలు సభను అడ్డుకున్నాయని మండిపడ్డారు. ఇక లోక్ సభ ప్రారంభమైన తర్వాత ఇటీవల చనిపోయిన ఇద్దరు ఎంపీలు, 11 మంది మాజీ ఎంపీలకు నివాళి అర్పించారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష నేతలు ఆందోళనలు మొదలుపెట్టారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. మణిపూర్ అంశంపై  చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ‘‘దీనిపై చర్చ ఎప్పుడనేది స్పీకర్ నిర్ణయిస్తారు. చర్చ ప్రారంభమైన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇస్తారు” అని తెలిపారు. అయినప్పటికీ ప్రతిపక్ష నేతలు ఆందోళనలు ఆపకపోవడంతో స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. 

ప్రతిపక్షాల మీటింగ్.. 

ఉదయం పార్లమెంట్ కాంప్లెక్స్ లో ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. మణిపూర్ ఇష్యూ, పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాయి. ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన 26 పార్టీల నేతలు.. మొదటిసారి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చాంబర్ లో సమావేశమయ్యారు. 

సోనియాకు మోదీ పరామర్శ 

మణిపూర్ లో పరిస్థితిపై పార్లమెంట్ లో చర్చించాలని ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేత సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. లోక్ సభ ప్రారంభానికి ముందు సభ్యులను మోదీ పలకరించారు. ప్రతిపక్ష నేతల బెంచ్ దగ్గరికి వెళ్లినప్పుడు సోనియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో చర్చించాలని మోదీని సోనియా కోరారని కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత ఆధిర్ రంజన్ చౌధురి చెప్పారు. కాగా, మణిపూర్ ఇష్యూపై ప్రధాని లేట్ గా స్పందించారని కాంగ్రెస్ విమర్శించింది. ‘‘1,800 గంటలకు పైగా మౌనం తర్వాత, ఎట్టకేలకు ప్రధాని మాట్లాడారు. ఇది టూ లిటిల్, టూ లేట్. మాటలు చెబితే సరిపోదు. చేతల్లో చూపించాలి” అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.