కంటోన్మెంట్/ ఖైరతాబాద్, వెలుగు: కొత్త సంవత్సరం మొదటిరోజున హైదరాబాద్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు.ఆదివారం తెల్లవారుజామున పనులకు వెళ్లేందుకు రోడ్డుపైకొచ్చిన ఇద్దరిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కొడుకును చూసేందుకు నిర్మల్ నుంచి సిటీకి వచ్చిన దంపతులు రోడ్డు దాటుతుండగా సిటీ బస్సు ఢీకొట్టడంతో మృతిచెందారు. ఉదయం 5గంటలకు పనులకు వెళ్లేందుకు శ్రీనివాస్, మరో మహిళ ఈశ్వరి బంజారాహిల్స్‌లోని రాయల్ టిఫిన్ సెంటర్‌వద్ద నిల్చున్నారు.
కె.ప్రణవ్, పి.శ్రీవర్ధన్ రావు ఇంజనీరింగ్ స్టూడెంట్లు అదే టైమ్‌లో సెలెరియో కారులో బంజారాహిల్స్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్నారు. స్పీడ్‌గా వచ్చిన వీరి కారు రాయల్టిఫిన్ సెంటర్ వద్ద డివైడర్‌ను ఢీకొని అక్కడే నిల్చున్న శ్రీనివాస్, ఈశ్వరిపైకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడి ఇద్దరూ స్పాట్లోనే చనిపోయారు. నిందితులు ప్రణవ్, శ్రీవర్ధన్ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొడుకును చూసేందుకు వచ్చి
నిర్మల్ పట్టణంలోని బంగల్ పేట్ కు చెంది న తునికి తులసీదాస్(70) అతని భార్య రాజ మణి (65) గచ్చిబౌలిలో ఉండే కొడుకు రామరాజును చూసేందుకు ఆదివారం హైదరాబాద్ వచ్చారు. బోయిన్ పల్లి చౌరస్తాలో మధ్యా హ్నం బస్సు దిగారు. బాలానగర్వైపు వెళ్లడానికి రోడ్డు క్రాస్ చేస్తుండగా సిటీ బస్సు ఢీకొట్టింది. ఇద్దరూ స్పాట్లోనే చనిపోయారు. స్థానికులు బస్సు డ్రైవర్ మార్గం నరహరి(45) ని పోలీసులకు అప్పగించారు. ఘటనాస్థలంలో దొరికిన సెల్ ఫోన్ తో తులసీదాస్కొడుకు రామరాజుకు కాల్ చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న రామరాజు తల్లిదండ్రుల మృతదేహాలను చూసి బోరున విలపించారు.