
నెట్వర్క్, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆదివారం తొలి ఏకాదశి పూజలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. భద్రాచలంలో రామయ్య దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం గర్భగుడిలో సుప్రభాత సేవ అనంతరం మూలవరులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. మూలవరులను సుందరంగా అలంకరించి ప్రత్యేక హారతులను అందజేశారు. బంగారు పుష్పాలతో సీతారామచంద్రస్వామికి అర్చనను చేశారు.
కల్యాణమూర్తులకు నిత్య కల్యాణం నిర్వహించగా 100 జంటలకు పైగా కంకణాలు ధరించి క్రతువును నిర్వహించాయి. ఈవో రమాదేవి, ఈఈ రవీందర్రాజులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం భక్తులు ఉపవాస దీక్ష విరమించారు. పాల్వంచ మండలంలోని కేపీ జగన్నాథపురంలో ఉన్న పెద్దమ్మ తల్లికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 108 బిందెల పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. అమ్మవారిని గజమాలతో అలంకరించారు. ఖమ్మం సిటీలోని లక్ష్మీ నరసింహస్వామి, స్వయంభూ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు ఇష్ట దైవాలను భక్తితో ఆరాధించారు.