గర్భగుడిలోకి రామ్ ​లల్లా.. జనవరి 22న మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ

గర్భగుడిలోకి రామ్ ​లల్లా..  జనవరి 22న మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ
  • ఆ రోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్ డే సెలవు
  • సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతున్న అయోధ్య నగరం


అయోధ్య:  అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ క్రతువులు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం బాలరాముడి (రామ్ లల్లా) విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొచ్చారు. నాలుగు గంటల పాటు పూజలు నిర్వహించిన తర్వాత రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. ఈ నెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 22న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే సెలవు ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో ఉద్యోగులు పాలుపంచుకునేందుకు వీలుగా ఆఫీసులను హాఫ్ డే మూసివేయాలని నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, పరిశ్రమలు ఈ నెల 22న మధ్యాహ్నం 2:30 గంటల వరకు మూసి ఉంటాయి” అని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

భక్తులందరి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఉద్యోగులందరూ లైవ్ లో వీక్షించడానికి వీలుగా హాఫ్ డే సెలవు ప్రకటించామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. కాగా, ప్రాణప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. రోడ్ల వెంబడి కలర్ ఫుల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. సిటీ అంతటా రామమందిరం, రాముడు, రామనంది తిలకం ఫొటోలు ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్యలోని రామ్ పథ్, ధర్మ పథ్ మార్గాల్లో ఏర్పాటు చేసిన డెకరేషన్ ఆకట్టుకుంటున్నది. లక్నో నుంచి అయోధ్యకు వెళ్లే హైవేపై భారీ కటౌట్లు పెట్టారు. హైవే వెంబడి ఉన్న హోటల్స్, దాబాలు అయోధ్యకు వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి.

ఉజ్జయినీ నుంచి 5 లక్షల లడ్డూలు.. 

అయోధ్యకు మధ్యప్రదేశ్ ఉజ్జయినీలోని మహాకాలేశ్వర్ టెంపుల్ నుంచి లడ్డూలు పంపిస్తున్నారు. 5 లక్షల లడ్డూలు అయోధ్యకు పంపిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ఒక్కో లడ్డూ 50 గ్రాములు ఉంటుందని, మొత్తం 250 క్వింటాళ్ల లడ్డూలను పంపిస్తామని చెప్పారు. ‘‘ఇప్పటికే 4 లక్షల లడ్డూలను ప్యాక్ చేశాం. మరో లక్ష లడ్డూలు ప్యాక్ చేస్తున్నాం. మొత్తం 5 లక్షల లడ్డూలను నాలుగు ట్రక్కుల్లో శుక్రవారం అయోధ్యకు పంపిస్తాం” అని వారు పేర్కొన్నారు. 150 మంది టెంపుల్ స్టాఫ్ తో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గత ఐదు రోజులుగా లడ్డూలను తయారు చేస్తున్నారని తెలిపారు. 

మహిళా భక్తులకు ఉచితంగా గాజుల పంపిణీ

అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకల సందర్భంగా మహిళా భక్తులకు 10 వేల గాజులను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ గాజులపై రాముడు, సీత, హనుమంతుడి రూపాలు ఉన్నాయి. ఫిరోజాబాద్ లో తయారు చేసిన ఈ గాజులను ట్రేడర్స్.. శ్రీ రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులకు గురువారం అందజేశారు. అయోధ్యకు వచ్చే భక్తులకు ఈ గాజులను ట్రస్ట్ ఆధ్వర్యంలో 22, 23 తేదీల్లో అందించనున్నారు. 

కర్నాటక దవాఖానలో ఉచిత డెలివరీలు

అయోధ్యలో జనవరి 22న రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుండటంతో కర్నాటక విజయపుర జిల్లాలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ హాస్పిటల్ లో ఈ నెల 18 నుంచి  22వ తేదీ వరకు ఉచితంగా డెలివరీలు చేస్తామని జేఎస్ఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెలిపింది. ఈ ఆసుపత్రిని శ్రీ సిద్ధేశ్వర్ లోక కల్యాణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తుంది.  హాస్పిటల్ తీసుకున్న నిర్ణయాన్ని విజయపుర ఎమ్మెల్యే బసన్న గౌడ పాటిల్ యత్నాల్ ప్రశంసించారు.

పోస్టల్ స్టాంప్స్, బుక్ రిలీజ్.. 

అయోధ్య రామమందిరంపై ప్రధాని మోదీ పోస్టల్ స్టాంప్స్ విడుదల చేశారు. రామమందిరం, గణనాథుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్ రాజ్, శబరిపై మొత్తం ఆరు స్టాంపులు రిలీజ్ చేశారు. అలాగే వివిధ దేశాలు రాముడిపై రిలీజ్ చేసిన పోస్టల్ స్టాంప్స్ తో రూపొందించిన బుక్ ను కూడా విడుదల చేశారు. అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియా తదితర 20 దేశాలు పైగా విడుదల చేసిన స్టాంప్స్ ఇందులో పొందుపరిచారు. అయోధ్య ఆలయం, అక్కడి కళాఖండాలు, సూర్య భగవానుడు, సరయూ నది ప్రతిబింబించేలా పోస్టల్ స్టాంప్స్ ను రూపొందించినట్టు అధికారులు తెలిపారు. ‘మంగళ్ భవన్ అమంగళ్ హరి’ అనే కవితను కూడా 
ముద్రించినట్టు పేర్కొన్నారు. 

నేలపైనే మోదీ నిద్ర.. 

అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో 11 రోజుల దీక్ష చేపట్టిన ప్రధాని మోదీ.. కఠిన నియమాలు పాటిస్తున్నారు. రోజూ నేలపైనే నిద్రిస్తున్నారు. కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారు. రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం నియమ నిష్ఠలతో 11 రోజుల పాటు పూజలు చేస్తానని మోదీ గత శుక్రవారం ప్రకటించారు.

మేం వ్యతిరేకం కాదు : ఉదయనిధి

చెన్నై: అయోధ్యలో రామ మందిరానికి  డీఎంకే వ్యతిరేకం కాదని ఆ పార్టీ నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. కానీ, మసీదును కూల్చివేసి మందిరాన్ని నిర్మించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు. డీఎంకే ఏ మతాన్ని లేదా మత విశ్వాసాలను వ్యతిరేకించదన్నారు. ‘‘అక్కడ గుడి రావడంలో మాకెలాంటి ఇబ్బంది లేదు. కానీ, ఆధ్యాత్మికతను రాజకీయాలను కలపడం కరెక్ట్ కాదు” అని అన్నారు. 

భక్తుల కోసం ఈ - కార్ట్స్

అయోధ్య రాముడిని భక్తులు దర్శించుకోవడానికి వీలుగా బ్యాటరీ ఆపరేటెడ్ కార్ట్స్ (గోల్ఫ్ కార్ట్స్) ను అధికారులు అందుబాటులోకి తెస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ప్రెగ్నెంట్ మహిళలు వీటిని ఉచితంగా ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. కొంత చార్జీ చెల్లించి ఇతరులు కూడా  కార్ట్స్ ను ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.  

మూడో రోజు గణేశుడి, వరుణుడి పూజలు..

అయోధ్య రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువులో భాగంగా మూడో రోజైన గురువారం గణేశుడి, వరుణుడి పూజలు నిర్వహించారు. మంగళవారం ప్రారంభమైన ఈ పూజలు జనవరి 21 వరకు కొనసాగుతాయని రామ జన్మభూమి టెంపుల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. పూజ పనులను 121 మంది అర్చకులకు అప్పగిస్తామని చెప్పారు. 

సరయూ తీరంలో ఎస్పీజీ తనిఖీలు

అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సరయూ నదిలో ప్రధాని మోదీ పవిత్ర స్నానం చేయనుండంటంతో  భద్రత నిమిత్తం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీజీ) సిబ్బంది ఆ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. స్థానిక పోలీసులతో కలిసి నది తీరంలో రెక్కీ నిర్వహించారు.