
ఆనాటి పరిశ్రమల మంత్రి శ్యాంప్రసాద్ ముఖర్జీ 1948 ఏప్రిల్ 6న తొలి పారిశ్రామిక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను రూపొందించాలని, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో పారిశ్రామిక ప్రగతి జరగాలని ఆశించింది. ఇందులో పరిశ్రమలను నాలుగు రకాలుగా వర్గీకరించారు.
ప్రభుత్వ ఏకస్వామ్యాలు: దేశ రక్షణ, తత్సంబంధ పరిశ్రమలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ఉదా: ఆయుధాలు – ఆయుధ సామగ్రి, అణుశక్తి, రైల్వేలు
మిశ్రమరంగంలోని పరిశ్రమలు: టెలిఫోన్, టెలీగ్రాఫ్ – వైర్లెస్, ఇనుము ఉక్కు, బొగ్గు, విమానాల ఉత్పత్తి, నౌకా నిర్మాణం, మినరల్ ఆయిల్స్. వీటిని 10 సంవత్సరాల వరకు ప్రైవేట్ వ్యక్తులే నిర్వహిస్తారు. 10 సంవత్సరాల తర్వాత జాతీయం చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. వీటిలో కొత్త పరిశ్రమలను ప్రభుత్వమే స్థాపిస్తుంది.
ప్రభుత్వరంగ అజమాయిషీలోని పరిశ్రమలు: భారీ రసాయనాలు, భారీ యంత్రాలు, యంత్ర పరికరాలు, ఎరువులు, పంచదార, సిమెంట్, కాగితం, ఆటోమొబైల్స్ మొదలైన 18 పరిశ్రమల్లో ప్రైవేటు రంగాన్ని అనుమతించినా ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది.
ఇతర పరిశ్రమలు: పై మూడు వర్గీకరణల్లో లేనివి దీనికిందికి వస్తాయి. ఇవి ప్రైవేట్ రంగంలో ఉంటాయి. ఈ తీర్మానం చిన్న పరిశ్రమల అవశ్యకతను , విదేశీ మూలధనం అవశ్యకతను, కార్మికులు, యాజమాన్యం మధ్య సంబంధాలను గుర్తించింది.
సమీక్ష: ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసింది. విదేశీ మూలధన ప్రాధాన్యతను గుర్తించింది. అయితే, 10 సంవత్సరాల తర్వాత జాతీయం చేయవచ్చు అనే వ్యాఖ్య వల్ల ఆ పరిశ్రమలపై శ్రద్ధ చూపలేదు.