ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్
  • కడప లోక్​సభ నుంచి బరిలో  షర్మిల

న్యూఢిల్లీ, వెలుగు: ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ను కాంగ్రెస్ రిలీజ్ చేసింది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. 5 లోక్ సభ, 114 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను మంగళవారం ప్రకటించింది. అలాగే ఒడిశాలో 8, బిహార్ లో 3, వెస్ట్ బెంగాల్ లో ఒక లోక్ సభ స్థానానికి పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ క్యాండిడేట్ల పేర్లను ప్రకటించారు. 

వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న కడప లోక్ సభ నియోజక వర్గం నుంచి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. ఇదే స్థానం నుంచి వైసీపీ తరఫున అవినాష్ రెడ్డి పోటీలో ఉన్నారు. వీరిద్దరి పోటాపోటీ ప్రచారంతో ఈ స్థానం ఆసక్తికరంగా మారనుంది. అలాగే బాపట్ల (ఎస్సీ) నుంచి కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, కర్నూల్ నుంచి పీజీ రామ్ పుల్లయ్య యాదవ్ కు పార్టీ అవకాశం ఇచ్చింది. ఇక 114 అసెంబ్లీ స్థానాల్లో... వైసీపీ నుంచి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్ లకు అవకాశం కల్పించింది. ఇందులో చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ లకు పార్టీ టికెట్ ఖరారు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ -శిగనమలకు సొంత నియోజక వర్గం కేటాయించింది.