
బాలీవుడ్ బయోపిక్స్‌కి కేరాఫ్‌గా మారింది. ఎంతోమంది ప్రముఖుల జీవిత గాథలు తెరకెక్కుతున్నాయక్కడ. అలాంటప్పుడు దేశ ప్రధానిని మాత్రం వదిలేస్తారా? ఆయన జీవితాన్నీ సినిమాగా తీశారు. కానీ మోడీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించిన ఆ చిత్రం పరాజయం పాలయ్యింది. ఇప్పుడు మరో ఫేమస్ దర్శక నిర్మాత మోడీ బయోపిక్ తీయడానికి రెడీ అయ్యాడు. ఆయన మరెవరో కాదు.. సంజయ్ లీలా భన్సాలీ.
సంజయ్ త్రిపాఠీ దర్శకత్వంలో ‘మన్ బైరాగీ’ పేరుతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు భన్సాలీ. ఇది ‘మనో విరాగి’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. అందరూ అనుకుంటు న్నట్టు మోడీ జీవితం తెరిచిన పుస్తకం కాదని, ఆయన యుక్త వయసులో ఎంతో మానసిక సంఘర్షణ అనుభవించారని, దేశం గురించి ఆయన ఏం ఆలోచించేవారన్నది ఎవరికీ తెలియదని, ఆ విషయాలనే తమ సినిమాలో చూపించబోతున్నామని అంటున్నాడు భన్సాలీ.
మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని ప్రభాస్ రిలీజ్ చేశాడు. ‘ఈ ప్రత్యేకమైన రోజున ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీద ఓ ప్రత్యేకమైన ఫిల్మ్ మేకర్ ప్రత్యేకమైన సినిమాను ప్రకటించారు. ‘మన్ బైరాగీ’ ఫస్ట్‌లుక్‌ను నేను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రధాన మంత్రి మోడీ గురించి ప్రజలకు తెలియని కథ ఇది. మోడీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశాడు ప్రభాస్. రియల్ లైఫ్ స్టోరీలను వెండితెరపై ఆవిష్కరించడంలో భన్సాలీ సిద్ధహస్తుడు. ఈ సినిమాకి దర్శకుడు కాకపోయినా తన నేతృత్వంలోనే సినిమా రూపొందుతోంది కనుక అంచనాలు పెట్టుకోవచ్చు.