గాంధీ విగ్రహానికి ఫస్ట్‌‌‌‌ ఎమ్మెల్యేనే దండ వేయాలె !.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్ల మధ్య వాగ్వాదం

 గాంధీ విగ్రహానికి ఫస్ట్‌‌‌‌ ఎమ్మెల్యేనే దండ వేయాలె !.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్ల మధ్య వాగ్వాదం
  • నర్సంపేటలో కాంగ్రెస్ కౌన్సిలర్లను అడ్డుకున్న మున్సిపల్ చైర్ పర్సన్‌‌‌‌ భర్త
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్ల గొడవ

నర్సంపేట, వెలుగు :  మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించే విషయంలో వరంగల్ జిల్లా నర్సంపేటలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్ల మధ్య వాగ్వాదం జరిగింది. సోమవారం ఉదయం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు, నాయకులు పెద్ద సంఖ్యలో జంక్షన్ వద్దకు చేరుకుని పూలదండలు వేసేందుకు సమాయత్తమయ్యారు. కాగా.. నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజిని భర్త కిషన్ తో పాటు మరికొందరు రూలింగ్ పార్టీ లీడర్లు కూడా గాంధీ విగ్రహం వద్దకు వచ్చారు.

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గానికి ప్రథమ పౌరుడని, ఆయన పూలమాల వేశాకే వేరే వాళ్లు వేయాలంటూ కాంగ్రెస్ లీడర్లతో ఘర్షణకు దిగారు. చివరకు ప్రొటోకాల్​విషయమై ఇరు వర్గాల వారు కమిషనర్ వెంకటస్వామికి ఫోన్ చేశారు. నివాళులర్పించే అంశంలో ఎటువంటి నిబంధనలు లేవని చెప్పడంతో కాంగ్రెస్ లీడర్లు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వెళ్లిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్​లీడర్లు గాంధీ విగ్రహానికి అప్పటివరకు వేసిన పూలమాలలు తీసివేయించి ఎమ్మెల్యే పెద్దితో పూలదండ వేయించారు.