బుజ్జగింపులు.. బేరసారాలు.. ముగిసిన మొదటి విడత నామినేషన్లు గెలుపు గుర్రాలపై పార్టీల దృష్టి

బుజ్జగింపులు.. బేరసారాలు.. ముగిసిన మొదటి విడత నామినేషన్లు   గెలుపు గుర్రాలపై పార్టీల దృష్టి

సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట,వెలుగు: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. గెలిచే అభ్యర్థులపై పార్టీలు దృష్టిపెట్టాయి. దీంతో బుజ్జగింపులు, బేరసారాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత సర్పంచ్ స్థానాలకు మొత్తం 2,606 నామినేషన్లు దాఖలు కాగా వార్డు స్థానాలకు 9,806 నామినేషన్లు అందాయి. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3 గడువు ఉండడంతో గెలుపు గుర్రాలపై ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. రెబెల్స్ ను పోటీ నుంచి తప్పించే ప్రయత్నంలో సెకండ్ క్యాడర్ లీడర్లు బిజీగా ఉన్నారు. 

మెదక్ జిల్లాలో..

మెదక్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే 6 మండలాల్లోని 160 సర్పంచ్ స్థానాలకు మొత్తం 842 నామినేషన్లు, 1,403 వార్డ్ మెంబర్ స్థానాలకు 2,919 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ పదవికి ముగ్గురు, నలుగురు నామినేషన్ వేసిన చోట పార్టీ ముఖ్య నాయకులు వారందరినీ కూర్చోబెట్టి  చర్చలు జరుపుతున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థి పోటీ చేసేందుకు మిగతావారు నామినేషన్లు ఉప సంహరించుకోవాలని నచ్చజెప్పుతున్నారు.

 కొందరికి వచ్చే పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీ గా పోటీ చేసే చాన్స్ ఉంటుందని, మరికొందరికి ఇతర నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. మరికొన్ని చోట్ల పోటీగా నామినేషన్ వేసిన వేసిన వారికి ప్యాకేజీ ఇచ్చేలా ఒప్పందాలు జరుగుతున్నట్టు సమాచారం. మండల కేంద్ర పంచాయతీ స్థానంలో పోటాపోటీగా నామినేషన్ వేసిన అభ్యర్థులతో ఏకాభిప్రాయం కోసం  ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జిలు చర్చిస్తున్నారు. 

7 పంచాయతీలు  ఏకగ్రీవం..

మెదక్ జిల్లాలో మొదటి విడతలో 7 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. సంగారెడ్డిపేట సర్పంచ్ గా పరిగప్పగారి బెతయ్య, మాడ్ శెట్టిపల్లి సర్పంచ్ గా  కుమార్, ఇసుక పాయ తండా సర్పంచ్ గా దేవసోత్ కవిత, గట్టికింద తండా సర్పంచ్ గా నవ్నత్ రాజు ఏకగ్రీవ మయ్యారు.టేక్మాల్ మండలంలో మొత్తం 29 గ్రామ పంచాయతీలు ఉండగా 3 గ్రామ పంచాయతీల్లో  సర్పంచ్ స్థానానికి ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలైంది. సాలోజిపల్లి నుంచి ఇర్షద్ ,  హసన్ మహమ్మద్ పల్లి నుంచి  కున్సొత్ చందు,  చల్లపల్లి నుంచి సంగీత నామినేషన్ వేశారు. ఈ గ్రామాల నుంచి ఒక నామినేషన్ రావడం, స్క్రూటినీలో రిజెక్ట్ కాకపోవడంతో ఏకగ్రీవం అయినట్లే. ఎన్నికల అధికారి డిసెంబర్ 2న అధికారికంగా ప్రకటించనున్నారు.

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి  డివిజన్ లోని 7 మండలాల పరిధిలో 136 పంచాయతీలు, 1,246 వార్డు స్థానాలకు మొదట దఫా ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత  136 సర్పంచ్ స్థానాలకు మొత్తం 811 నామినేషన్లు, 1,247 వార్డు స్థానాలకు 3,473 నామినేషన్లు దాఖలయ్యాయి.

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్, వార్డు స్థానాలకు మొత్తం 4457 నామినేషన్లు దాఖలయ్యాయి.  7 మండలాల పరిధిలో 167 గ్రామ పంచాయతీల కు 953,  1432 వార్డులకు  3504 నామినేషన్లు దాఖలయ్యాయి. జగదేవ్ పూర్ మండలంలోని 4  గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు ఒక్కో  నామినేషన్ మాత్రమే దాఖలైంది. ఈ పంచాయతీలు ఏకగ్రీవమని అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది.