- మొదటి విడత పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ సెగ్మెంట్లలో మంత్రి దామోదర్, మెదక్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేల స్పెషల్ ఫోకస్
మెదక్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలు మంత్రి, ఎమ్మెల్యేలకు సవాల్గా మారాయి. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ల పరిధిలోని మండలాల్లోనే మొదటి విడత ఎన్నికలు జరుగనున్నాయి. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలుండగా మొదటి విడతలో 6 మండలాల్లోని 160 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో రేగోడ్, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాలు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో, పెద్దశంకరంపేట మండలం కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణఖేడ్ పరిధిలో, పాపన్న పేట, హవేలీ ఘనపూర్ మండలాలు మైనంపల్లి రోహిత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి.
ఏకాభిప్రాయం ద్వారా అభ్యర్థిత్వం ఖరారు
బీఆర్ఎస్ హయాంలో 2019లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగ్గా అప్పుడు ఈ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ బలపర్చినవారే సర్పంచ్‌లుగా గెలిచారు. అధికార పార్టీకి చెందిన వారు సర్పంచులుగా ఉంటే గ్రామాల అభివృద్ధికి జరుగుతుందన్న ఉద్దేశంతో ప్రజలు బీఆర్ఎస్మద్దతుదారులను గెలిపించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. అందోల్, నారాయణఖేడ్, మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు మంత్రి దామోదరకు, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, రోహిత్‌లకు ప్రతిష్టాత్మకంగా మారాయి.
గ్రామాల్లో పార్టీ పటిష్టంగా ఉందని చెప్పుకోవడంతో పాటు తమ పాలనకు ప్రజల మద్దతు ఉందని నిరూపించుకోవచ్చని భావిస్తున్నారు. ఎమ్మెల్యేల సూచనతో మండలస్థాయి నేతలు ఆశావహులతో మాట్లాడుతూ ఎన్నికల వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఎక్కువ మంది పోటీకి సిద్ధపడిన చోట్ల వారితో చర్చించి, ఏకాభిప్రాయం ద్వారా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసేలా కార్యకర్తలకు మోటివేట్ చేస్తున్నారు. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలిచేలా వ్యూహరచన చేస్తున్నారు.
