- నేడు మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ..
- మూడో విడత షురూ
- సాయంత్రం గుర్తుల ప్రకటన
మహబూబ్ నగర్/మద్దూరు, వెలుగు : మొదటి దశ సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నిక కీలక దశకు చేరుకుంది. ఈ గ్రామ పంచాయతీలకు గత నెల 30 వరకు క్యాండిడేట్ల నుంచి నామినేషన్లును తీసుకోగా.. బుధవారం నామినేషన్ల ఉప సంహరణ జరగనుంది. అదే రోజు సాయంత్రం బరిలో నిలిచే క్యాండిడేట్ల పేర్లను ప్రకటించి.. రాత్రికి గుర్తులు కేటాయించనున్నారు. ఈ తరుణంలో ఆయా గ్రామ పంచాయతీల నుంచి బరిలో ఎవరూ ఉంటారనేది పల్లెల్లో ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం అవుతుండగా.. మరిన్ని గ్రామ పంచాయతీలు యునానిమస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రధాన పార్టీల లీడర్లు రంగంలోకి దిగి, చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా రెబల్స్‌గా నామినేషన్లు వేసిన వారిని చర్చలకు పిలుస్తున్నారు. కొందరినీ ఫోన్లో కాంటాక్ట్ అవుతుండగా, వారు క్యాంపు ఆఫీసులకు రావడం లేదు.
నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని చెన్నారెడ్డిపల్లిలో ఈ పరిస్థితి ఉంది. ఈ గ్రామ పంచాయతీ బీసీ జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. అయితే కాంగ్రెస్ మద్దతుతో ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. కానీ ఈ స్థానం నుంచి పోటీ చేయాలని మరో ఇద్దరు నామినేషన్లు వేశారు. వీరిలో ఒక వ్యక్తి నామినేషన్విత్ డ్రా చేసుకోగా, మరో లీడర్ చిన్న ఆంజనేయులు నామినేషన్ విత్ డ్రా చేసుకోవడానికి నిరాకరించారు.
ఇదే మండలంలోని ఓ గ్రామ పంచాయతీ బీసీ మహిళకు రిజర్వ్ కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నామినేషన్లు వేశారు. ఒకరికి కాంగ్రెస్ మద్దతు ఉండగా, మరొకరు రెబల్‌గా వేశారు. రెబల్‌గా వేసిన వారిని విత్ డ్రా చేయించేందుకు ప్రయత్నిస్తుండగా.. రెండు రోజులుగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఇదే పరిస్థితి పలు గ్రామ పంచాయతీల్లోనూ ఉంది.
పోటీ చేయడానికే రెబల్స్ ఇంట్రెస్ట్..
మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న గ్రామ పంచాయతీల్లో ప్రధాన పార్టీల మద్దతు కోరి.. కొందరు లీడర్లు భంగపడ్డారు. కొంతకాలంగా సర్పంచ్ పదవిపై ఆశలు పెట్టుకున్న వీరిని కాకుండా.. ఆయా పార్టీల్లో కొత్తగా చేరినవారికి అవకాశాలు ఇవ్వడంతో జీర్ణిచుకోలేకపోయారు. దీంతో చివరి రోజు రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వీరిని లీడర్లు బుజ్జగించే ప్రయత్నాలు చేసినా దిగి రావడం లేదు. కచ్చితంగా పోటీలో ఉంటామనే సంకేతాలు ఇస్తున్నారు. దీంతో వారు చేసేదేమీలేక ఈ విషయాన్ని వదిలేస్తున్నారు.
పోటాపోటీగా నామినేషన్లు..
రెండో విడత ఎన్నికలు జరిగే దామరగిద్ద, దన్వాడ, మరికల్, నారాయణపేట, చిన్నచింతకుంట, కౌకుంట్ల, దేవరకద్ర, హన్వాడ, మిడ్జిల్, కోయిల్‌కొండ మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఈ స్థానాల్లో ఇప్పటి వరకు ఎక్కడా ఏకగ్రీవాలు కాలేదు. అన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బలపర్చిన అభ్యర్థుల మధ్య ద్విముఖ, త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధాన పార్టీలు సామాజిక, ఆర్థిక బలం ఉన్న లీడర్లకు మద్దతు ఇస్తూ వారిని రంగంలోకి దింపాయి. కానీ పలు చోట్ల ఈ స్థానాల్లో ఇండిపెండెంట్లు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
నేటి నుంచి మూడో విడత నామినేషన్లు..
బుధవారం నుంచి మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలకు నామినేషన్లు తీసుకోనున్నారు. ఈ విడతలో నారాయణపేట జిల్లాలోని నర్వ మండలంలో 19 గ్రామ పంచాయతీలకు, మక్తల్ మండలంలోని 39 గ్రామ పంచాయతీలు, మాగనూరులో 16, కృష్ణలో 13, ఊట్కూరులో 23 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు, మూసాపేటలో 15, భూత్పూర్ లో 19, బాలానగర్‌లో 37, జడ్చర్లలో 45 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
