ఫస్ట్‌‌ ఫేజ్ ర్యాండమైజేషన్ పూర్తి: హనుమంతు

ఫస్ట్‌‌ ఫేజ్ ర్యాండమైజేషన్ పూర్తి: హనుమంతు

యాదాద్రి, సూర్యాపేట,  వెలుగు: ఈవీఎంల ఫస్ట్‌‌ ఫేజ్‌‌ ర్యాండమైనేషన్ పూర్తయ్యింది.  ఎన్నికల కమిషన్​ ఆదేశాల మేరకు శుక్రవారం యాదాద్రి కలెక్టరేట్‌‌లో  కలెక్టర్‌‌‌‌ హనుమంతు జెండగే పొలిటికల్​ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ర్యాండమైజేషన్ నిర్వహించి భువనగిరిలోని 257 పోలింగ్ సెంటర్లకు 321 బ్యాలెట్ యూనిట్స్, 321 కంట్రోల్ యూనిట్స్, 359 వీవీప్యాట్స్ , అలేరులో 309 పోలింగ్ కేంద్రాలకు 386 బ్యాలెట్ యూనిట్స్, 386 కంట్రోల్ యూనిట్స్, 432 వీవీప్యాట్స్ కేటాయించారు.

సూర్యాపేటలో పాత కలెక్టరేట్‌‌లో నిర్వహించిన ర్యాండమైజేషన్‌‌లో కలెక్టర్ వెంకట్‌‌రావు  జిల్లాలోని 4 నియోజకవర్గ పరిధిలోని 1201 పోలింగ్ కేంద్రాలకు 1502 బ్యాలెట్ల యూనిట్లు , 1502కంట్రోల్ యూనిట్లు, 1680 వీవీ ఫ్యాట్స్ కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ పారదర్శకత నిర్వహించేందుకు ర్యాండమైజేషన్ చేపట్టామని, ఏ ఈవీఎం ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్తుందో  ఈసీ రూపొందించిన సాఫ్ట్ వేర్ మాత్రమే నిర్దేశిస్తుందని చెప్పారు.

మొదటి ర్యాండమైజేషన్ సంబంధించి హర్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించామని, నియోజకవర్గ కేంద్రంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్‌‌కు వారి సమక్షంలోనే తరలిస్తామని చెప్పారు. అనంతరం కలెక్టరేట్‌‌లో ఏర్పాటు చేసిన బ్యాంక్ ట్రాన్జాక్షన్స్‌‌ మానిటరింగ్ సెల్‌‌ను  ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్యాంకులతో పాటు డిజిటల్ లావాదేవీల వివరాల సేకరణకు ప్రత్యేక కమిటీ నియమించామని చెప్పారు.  రోజూవారీ లావాదేవీలపై నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్లు, జిల్లా అధికారులు ఉన్నారు.