
హైదరాబాద్: దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ బడా గణపతి తొలి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఏడాది 69 అడుగులతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువుదీరిన గణనాథుడికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు తొలి రోజే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఓ వైపు వర్షం పడుతున్న లెక్క చేయకుండా క్యూ లైన్లలో నిల్చొని గణేశుడి ఆశీర్వాదం కోసం తీసుకుంటున్నారు. భక్తుల కోలాహలంతో ఖైరతాబాద్ ప్రాంత సందడిగా మారింది. జై గణేశా.. జైజై గణేశా నినాదాలతో ఖైరతాబాద్గణేశ్మండప ప్రాంతం దద్దరిల్లిపోతుంది. గణనాథుడి దర్శనం కోసం భక్తులు పొటెత్తడంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బడా గణపతి వద్ద పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.