నీట మునిగి ఏడాది దాటినా పంప్‌హౌజ్ రిపేర్​ కాలే!

నీట మునిగి ఏడాది దాటినా పంప్‌హౌజ్ రిపేర్​ కాలే!
  • ఎల్లూరు పంపు హౌస్​లో మూలకుపడ్డ 2 మోటార్లు
  • కోటి రూపాయల పనులు నీళ్లపాలు   
  •  కృష్ణా నదిలో నీళ్లున్నా వాడుకోలేని పరిస్థితి
  • 50టీఎంసీలకుగాను ఇప్పటివరకు 
  • ఎత్తిపోసింది 15 టీఎంసీలే
  • మున్ముందు తాగునీటికీ కష్టకాలమే


నాగర్​కర్నూల్, వెలుగు: కల్వకుర్తి లిఫ్ట్ స్కీంలోని మొదటి పంప్​హౌజ్​ ఎల్లూరు నీట మునిగి ఏడాది దాటుతున్నా సర్కారు నేటికీ రిపేర్లు చేయలేకపోయింది. ప్రమాదానికి కారణాలు అన్వేషించడానికి నియమించిన కమిటీ సైతం నెలలు గడుస్తున్నా ఏమీ తేల్చడం లేదు. ప్రమాదంలో మూడో పంప్​బేస్​ నుంచి విడిపోగా పంప్​హౌజ్​లో 54 మీటర్ల ఎత్తు వరకు నీరు చేరింది. బేస్​నుంచి విడిపోయిన మూడో పంప్​ ఎందుకూ పనికి రాకుండా పోయింది. ఐదో పంప్, ​అప్రోచ్​చానల్​కు మధ్య ఉండే రాక్​లెడ్జర్​కు పడ్డ హోల్​ను బాగుచేసే పనులను ఆరేడు నెలలపాటు పట్టించుకోని ఇరిగేషన్​ఇంజనీర్లు ఈ ఏడాది వేసవిలో హడావిడిగా మొదలు పెట్టారు. ఐదేళ్లుగా మెయింటెనెన్స్​పనులు చేస్తున్న పటేల్​ కంపెనీని కాదని మేఘా కంపెనీని రంగంలోకి దింపారు. ఎస్టిమేషన్​ ప్రపోజల్స్​లేకుండానే సాగునీటి సలహాదారు పెంటారెడ్డి సూపర్​వైజింగ్​లో పనులు చేయించారు. పంప్​హౌజ్, సర్జ్​పూల్​మధ్యన ఉన్న రాక్​ లెడ్జర్​కు పడిన భారీ రంధ్రాన్ని మూసేందుకు అప్రోచ్​కెనాల్​ను క్లోజ్​ చేశారు.15 రోజుల పాటు మిషన్​ భగీరథకు వాటర్​ సప్లై ఆపేశారు. ఇంతా చేస్తే కట్టిన ప్రొటెక్షన్​ వాల్​ మూడు రోజులకే కూలినట్లు గుర్తించారు. ఐదో పంప్​కెనాల్​షటర్ తెరిస్తే  పంప్​హౌజ్​ మునిగే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో దాన్ని కూడా మూసేశారు. ​దీంతో దాదాపు రూ. కోటి వరకు చేసిన ఖర్చు నీళ్లపాలైంది.  ఇక ఐదో పంప్​కింద సీపేజ్​వాటర్​ సమస్య తీవ్రత దృష్ట్యా నాలుగు పంపులు పెట్టి కంటిన్యూగా డీవాటరింగ్ చేస్తున్నారు.​  మొదటి లిఫ్ట్​లోని ఐదు పంపుల్లో రెండు మూలకు పడగా ప్రస్తుతానికి మిగిలిన మూడింటితోనే మిషన్​భగీరథ స్కీం, సాగుకు నీటిని పంపింగ్​చేస్తున్నారు.  ఇందులో ఏ ఒక్క పంప్​ రిపేర్​కు వచ్చినా సమస్య మొదటికి వస్తుంది. 

ఇప్పటికీ 15 టీఎంసీలే..

ఈ సీజన్​లో కృష్ణా నదికి  భారీ వరదలు వస్తుండగా కేఎల్ఐ, మిషన్​ భగీరథకు 50 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశం ఉండేది. తద్వారా కేఎల్ఐ కింద 4.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది.  కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇరిగేషన్​అధికారుల పట్టనితనంతో ఆయకట్టుతో పాటు 19 నియోజకవర్గాలకు తాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. కృష్ణా నదికి జూన్​లో వరదలు స్టార్ట్​ కాగా కేఎల్ఐ కింద ఇప్పటివరకు కేవలం 15 టీఎంసీల నీటిని మాత్రమే లిఫ్ట్​ చేయగలిగారు.  మిగిలిన 35 టీఎంసీల నీటిని త్వరలో ఎత్తిపోస్తామని ఇరిగేషన్​ అధికారులు అంటున్నా మూడు పంపులతో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రెండు పంపులు పనిచేయకపోవడం వల్ల కనీసం 15 టీఎంసీలు లాస్​ అయినట్లే నని తెలుస్తోంది.  వచ్చేది వేసవి కావడం వల్ల  ఉన్న మూడుపంపుల్లో ఏ ఒక్కటి దెబ్బతిన్నా తాగునీటికి సమస్యలు తలెత్తే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.