 
                                    హుస్నాబాద్, వెలుగు: గతంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు పడడంతో భారీ నష్టం జరిగిందని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హుస్నాబాద్‌లోని అగ్రికల్చర్ మార్కెట్‌లో తడిసిన వడ్లను గురువారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మార్కెట్‌లో కొనుగోళ్లను స్పీడప్ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులెవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు. మొక్కజొన్న కొనుగోళ్లపై మార్క్ ఫెడ్ ఆఫీసర్లతో మాట్లాడామని, ప్రస్తుతం ఉన్న 18 క్వింటాళ్ల పరిమితిని 28 క్వింటాళ్లకు పెంచే అవకాశం ఉందన్నారు.
హుస్నాబాద్ పరిధిలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టనున్నారని ప్రకటించారు. అనంతరం వర్షం కారణంగా ధాన్యం కోల్పోయిన రైతు సారవ్వకు రూ.10 వేల సాయం అందజేశారు. మంత్రి వెంట కలెక్టర్ హైమావతి, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఏసీపీ సదానందం, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నంది తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శివయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ బంక చందు, డైరెక్టర్లు శ్రీనివాస్ పాల్గొన్నారు.

 
         
                     
                     
                    