దేశంలోనే మొదటి సెల్ఫీ మ్యూజియం

 దేశంలోనే మొదటి సెల్ఫీ మ్యూజియం

శామీర్‌‌పేట్‌‌లోని పంజాబీ హవేలీ దాబాకు దగ్గర్లో ‘హైదరాబాద్ సెల్ఫీ మ్యూజియం’ ఉంది. ఇది దేశంలోనే మొదటి సెల్ఫీ మ్యూజియం. సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునేలా ఇక్కడ రకరకాల డిజైన్లు కనిపిస్తాయి. వేర్వేరు కలర్ థీమ్స్‌‌తో ఉండే బ్యాక్‌‌గ్రౌండ్స్,  లైటింగ్స్‌‌తో నిండిన గదులు, పెయింటింగ్స్ ఉండే గోడలు.. ఇలా ఎన్నోరకాల థీమ్స్‌‌తో బోలెడు సెట్స్ రెడీగా ఉంటాయి. నచ్చిన సెట్‌‌లో నచ్చినట్టుగా పోజు ఇచ్చి సెల్ఫీలు దిగొచ్చు.

ఇరవై సెట్స్


ఈ మ్యూజియంలో త్రీడీ సెల్ఫీ సెట్లు, రంగురంగుల బ్యాక్‌‌గ్రౌండ్స్,  పాత టెలిఫోన్ బూత్, బార్బీ బాక్స్, మిలియనీర్ బెడ్, పింక్ చేతక్ స్కూటర్, డోనట్ వాల్ ఇలా.. ఇరవైరకాల సెట్లు ఉంటాయి. ఒక్కో సెట్‌‌లో పది మందికి చోటు ఉంటుంది. ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మొత్తం సెల్ఫీ తీసుకునేలా వీటిని డిజైన్ చేశారు.  ఇక్కడ బర్త్‌‌డే పార్టీల్లాంటివి కూడా చేసుకోవచ్చు. ప్రీ వెడ్డింగ్‌‌ షూట్స్‌‌ లాంటివి  ప్లాన్‌‌ చేసుకోవాలంటే మ్యూజియం వాళ్లకు ముందుగా చెప్పాలి. అడిగిన థీమ్‌‌ను బట్టి వాళ్లు సెట్లు రెడీ చేసి ఇస్తారు. ఇక్కడ  ప్రొఫెషనల్‌‌ ఫొటోగ్రాఫర్లు కూడా ఉంటారు. కావాలంటే వాళ్లతో ఫొటోలు తీయించుకోవచ్చు.  ఈ మ్యూజియం వారం మొత్తం అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకూ తెరచి ఉంటుంది. మ్యూజియం ఛార్జి గంటకు రూ.500.

 రెస్పాన్స్ బాగుంది

“మామూలుగా ఏదైనా కొత్త ప్లేస్‌‌కు వెళ్తే అక్కడొక సెల్ఫీ తీసుకోవాలనుకుంటారు ఎవరైనా. అలాకాకుండా ‘సెల్ఫీల కోసమే ప్రత్యేకంగా ఒక మ్యూజియం ఉంటే ఎలా ఉంటుంది’ అన్న ఐడియాతో మొదలైంది సెల్ఫీ మ్యూజియం. ఈ మ్యూజియం పెట్టి ఆరు నెలలు కావొస్తోంది. యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన సెట్స్‌‌ సెల్ఫీలకు మాత్రమే కాదు, ప్రీవెడ్డింగ్ షూట్స్​కు కూడా బాగుంటాయి. ఒకేరకమైన సెట్లతో బోర్ కొట్టించకుండా ప్రతి ఆరు నెలలకొకసారి సెట్స్ మార్చాలనే రూల్ పెట్టుకున్నాం. ప్రస్తుతం ఉన్న సెల్ఫీ మ్యూజియం సిటీకి కాస్త దూరంలో ఉంది. కాబట్టి సిటీలో మరిన్ని సెల్ఫీ మ్యూజియంలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.”

- రాహుల్ ఆనంద్, మ్యూజియం ఫౌండర్