V6 News

రూ.30 లక్షలకు వచ్చినోళ్లు.. మోత పుట్టించారు.. ప్రఫుల్‌‌‌‌‌‌‌‌ హింగే, సాకిబ్ దెబ్బకు RR కకావికలం.. SRH అపూర్వ విజయం

రూ.30 లక్షలకు వచ్చినోళ్లు.. మోత పుట్టించారు.. ప్రఫుల్‌‌‌‌‌‌‌‌ హింగే, సాకిబ్ దెబ్బకు RR కకావికలం.. SRH అపూర్వ విజయం
  • రాజస్తాన్ నడ్డి విరిచిన అరంగేట్రం పేసర్ ‌‌‌‌‌‌‌‌ప్రఫుల్‌‌‌‌‌‌‌‌ హింగే
  • మెరిసిన ఇషాన్, సాకిబ్  
  • 57 రన్స్ తేడాతో రాయల్స్‌‌‌‌‌‌‌‌పై సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌ గ్రాండ్ విక్టరీ

హైదరాబాద్, వెలుగు: వరుసగా రెండు ఓటముల తర్వాత సొంతగడ్డపై ఇద్దరు కొత్త పేసర్లతో బరిలోకి దిగిన  ఆరెంజ్ ఆర్మీ మునుపటి రేంజ్ చూపింది. ఉప్పల్ గడ్డపై  పరుగుల మోత, వికెట్ల వేటతో భాగ్యనగర ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌కు కిక్‌‌‌‌‌‌‌‌ ఇస్తూ లీగ్‌‌‌‌‌‌‌‌లో రెండో విజయం అందుకుంది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 57  రన్స్ తేడాతో  రాజస్తాన్ రాయల్స్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. తొలుత హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 216/6 భారీ స్కోరు సాధించింది. హెన్రిచ్ క్లాసెన్ (26 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 3 సిక్సర్లతో 40) కూడా రాణించాడు. జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో రాయల్స్  19 ఓవర్లలో 159  రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. డొనొవన్ ఫెరీరా (44 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 69), రవీంద్ర జడేజా (32 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లతో 45) పోరాటం ఓటమి అంతరాన్నే తగ్గించింది. ఈషాన్ మలింగ (2/31) రెండు వికెట్లతో రాణించాడు.  హింగేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఫస్ట్ బాల్‌‌‌‌‌‌‌‌కే షాక్.. ఇషాన్‌‌‌‌‌‌‌‌ ధనాధన్‌‌‌‌‌‌‌‌
హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ ఇషాన్ కిషన్ వెన్నెముకగా నిలిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన హోమ్ టీమ్‌‌‌‌‌‌‌‌కు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ (0) జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌‌‌‌‌‌‌‌కే భారీ షాట్‌‌‌‌‌‌‌‌కు ప్రయత్నించి రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (18) ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పూర్తిగా తడబడ్డాడు.  ఓ ఎండ్‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్ ఖతర్నాక్ షాట్లతో అలరించాడు. ఆర్చర్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో షార్ట్ ఫైన్ లెగ్ మీదుగా ఫోర్ కొట్టిన అతను ఆపై డీప్ మిడ్ వికెట్‌‌‌‌‌‌‌‌ మీదుగా సిక్స్ రాబట్టాడు. 

తర్వాత  బర్గర్, సందీప్ శర్మ ఓవర్లలో రెండు భారీ సిక్సర్లు బాదిన అతను తుషార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాబట్టాడు. దాంతో  పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేను 51/1తో ముగించాడు. మరో ఎండ్‌‌‌‌‌‌‌‌లో ఇబ్బంది పడ్డ హెడ్‌‌‌‌‌‌‌‌ను ఏడో ఓవర్లో రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఔట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 55 రన్స్ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది. ఫీల్డింగ్ మారి, స్పిన్నర్లు రంగంలోకి దిగిన తర్వాత కూడా ఇషాన్ జోరు కొనసాగించాడు. క్లాసెన్ సపోర్ట్‌‌‌‌‌‌‌‌తో క్రమం తప్పకుండా బౌండరీలు రాబట్టాడు.

బిష్ణోయ్ వేసిన పదో ఓవర్లో ఇద్దరూ చెరో  సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టారు. ఈ క్రమంలో ఇషాన్ 30 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోవడంతో పాటు స్కోరు వంద దాటింది. తుషార్ వేసిన తర్వాతి ఓవర్లో  మరింత విజృంభించిన ఇషాన్ మూడు ఫోర్లు, సిక్స్‌‌‌‌‌‌‌‌తో 21 రన్స్ పిండుకున్నాడు. ఆపై ఆర్చర్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో హ్యాట్రిక్ ఫోర్లతో 90ల్లోకి వచ్చిన అతను సెంచరీ చేసేలా కనిపించాడు. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో కాసేపు స్టేడియం ఫ్లడ్‌‌‌‌‌‌‌‌ లైట్లు ఆగిపోయి ఆట నిలవడంతో ఇషాన్ ఏకాగ్రత కోల్పోయాడు. 

ఆట తిరిగి మొదలైన వెంటనే సందీప్ శర్మకు రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో. మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 88 రన్స్ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ అయింది. కాసేపటికే తుషార్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో క్లాసెన్ కూడా వెనుదిరిగాడు. అయితే చివర్లో నితీష్ కుమార్ రెడ్డి (13 బాల్స్‌‌‌‌‌‌‌‌లో  28) అదరగొట్టాడు. సందీప్ శర్మ వేసిన 18వ ఓవర్లో మూడు సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు.   సలీల్ అరోరా (13 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 24 నాటౌట్)  ఆఖరి బాల్‌‌‌‌‌‌‌‌ను సిక్సర్‌‌‌‌‌‌‌‌గా మలచడంతో హైదరాబాద్ స్కోరు 210 దాటింది.

కొత్త పేసర్ల పంజా

భారీ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన రాజస్తాన్.. సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్ యంగ్ బౌలర్ల ధాటికి కకావికలమైంది.ప్రఫుల్ హింగే నిప్పులు చెరిగే బాల్స్‌‌‌‌‌‌‌‌తో ఆ టీమ్ నడ్డి విరిచాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. సూపర్ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న యంగ్‌‌‌‌‌‌‌‌ సెన్సేషన్, బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ (0)ని తన రెండో బంతికే  షార్ట్‌‌‌‌‌‌‌‌ పిచ్ డెలివరీతో గోల్డెన్ డకౌట్‌‌‌‌ చేసిన హింగే  ఆ తర్వాత ధ్రువ్ జురెల్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 

ఓవర్ లాస్ట్ బాల్‌‌‌‌‌‌‌‌కు లువాన్ ప్రిటోరియస్ (0)... నితీష్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇవ్వడంతో రాయల్స్ 1 రన్‌‌‌‌‌‌‌‌కే 3 వికెట్లు కోల్పోయింది. ఆ టీమ్ కష్టాలు అక్కడితో ఆగలేదు. మరో ఎండ్‌‌‌‌‌‌‌‌లో సాకిబ్ హుస్సేన్ తన తొలి ఓవర్లోనే ఇన్‌‌‌‌‌‌‌‌ఫామ్ బ్యాటర్  యశస్వి జైస్వాల్ (1)ను ఔట్ చేయగా... హింగే వేసిన మూడో ఓవర్లో  కెప్టెన్ రియాన్ పరాగ్ (4) .. అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో 9/5తో నిలిచిన రాజస్తాన్ 50 రన్స్ చేస్తే గొప్పే అనిపించింది. 

ఈ కష్ట సమయంలో డొనొవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా  ఇన్నింగ్స్‌‌‌‌ ను నిలబెట్టారు. హింగే బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో 6, 4 కొట్టిన ఫెరీరా.. శివాంగ్ కుమార్ వేసిన ఏడో ఓవర్లో  వరుసగా రెండు ఫోర్లు బాది ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేశాడు. జడేజా స్ట్రయిక్ రొటేట్ చేసే బాధ్యత తీసుకోగా.. 11వ ఓవర్లో 6, 4.. ఆపై స్పిన్నర్ హర్ష్‌‌‌‌‌‌‌‌ దూబే బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో వరుసగా 4, 4, 6 బాది 29 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో మళ్లీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన సాకిబ్ .. ఫెరీరాను బౌల్డ్ చేసి ఆరో వికెట్‌‌‌‌‌‌‌‌కు  118 రన్స్ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ చేశాడు. ఈషాన్ మలింగ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో జడేజా కూడా వెనుదిరగ్గా.. ఆ వెంటనే వరుస బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఆర్చర్ (2), బిష్ణోయ్ (0) వికెట్లు తీసిన సాకిబ్ విజయం ఖాయం చేశాడు. ఈషాన్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో తుషార్ దేశ్‌‌‌‌‌‌‌‌పాండే (25) లాస్ట్ వికెట్‌‌‌‌‌‌‌‌గా ఔటయ్యాడు.

సంక్షిప్త స్కోర్లు

  • సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌: 20  ఓవర్లలో 216/6 (ఇషాన్ 91, క్లాసెన్ 40, ఆర్చర్ 2/37).
  • రాజస్తాన్‌‌‌‌‌‌‌‌: 19  ఓవర్లలో 159 ఆలౌట్ (ఫెరీరా 69, జడేజా 45, సాకిబ్ 4/24, ప్రఫుల్ 4/34).

* ఐపీఎల్ మ్యాచ్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌  ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌‌‌‌‌‌‌‌గా ప్రఫుల్‌‌‌‌ హింగే రికార్డుకెక్కాడు.

* టీ20 ఫార్మాట్‌‌‌‌లో హింగేకు ఇది రెండో మ్యాచ్‌‌‌‌ మాత్రమే. ఇంతకుముందు తన స్టేట్‌‌‌‌ టీమ్ విదర్భ తరఫున ఓసారి బరిలోకి దిగాడు.

* ఓ టీమ్ రెండు రన్స్‌‌‌‌కే  నాలుగు వికెట్లు కోల్పోవడం ఐపీఎల్‌‌‌‌ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. 2011లో  ఉప్పల్‌‌‌‌ స్టేడియంలోనే డెక్కన్ చార్జర్స్ బౌలింగ్‌‌‌‌ దాటికి కొచ్చి టస్కర్స్ 2 రన్స్‌‌‌‌ కే 4 వికెట్లు కోల్పోయింది.

* ఈ ఏడాది టీ20ల్లో అభిషేక్ డకౌటవ్వడం18 మ్యాచ్‌‌‌‌ల్లో ఇది ఏడోసారి. 17 ఇన్నింగ్స్‌‌‌‌ల్లో 4సార్లు డకౌటైన కూపర్ కనోలి రికార్డు బ్రేక్ చేశాడు.

మరిన్ని వార్తలు