- హమాలీ, డొమెస్టిక్ వర్కర్ల కోసం ఏర్పాటు: మంత్రి వివేక్ వెంకటస్వామి
- గిగ్ వర్కర్ల చట్టం నిబంధనలు త్వరలో వెల్లడిస్త
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట భద్రతను విస్మరిస్తే ఊరుకోం
- ‘సోషల్ డెమోక్రసీ’ సదస్సుకు హాజరు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికులకు పూర్తి సామాజిక భద్రత కల్పించడంతో పాటు వారి హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర శక్తి శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే హమాలీ, డొమెస్టిక్ వర్కర్ల కోసం త్వరలోనే వేర్వేరుగా సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్ల సంక్షేమ చట్టానికి సంబంధించిన నిబంధనలను సైతం త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.
శుక్రవారం హైదరాబాద్లోని లెమన్ ట్రీ హోటల్లో ‘సోషల్ డెమోక్రసీ, పొలిటికల్ లీడర్షిప్ అండ్ ట్రేడ్ యూనియన్స్ రీబిల్డింగ్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ సోషల్ డైలాగ్’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో దాదాపు 93% మంది అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారని, సంఘటిత రంగ కార్మికుల మాదిరిగా వీరికి బలమైన యూనియన్ల ప్రాతినిధ్యం లేకపోవడంతో రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
తన తండ్రి గడ్డం వెంకటస్వామి సైతం పారిశ్రామికవర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా లెక్కచేయకుండా ప్రైవేటు రంగ ఉద్యోగుల పెన్షన్ కోసం గట్టిగా నిలబడ్డారని గుర్తుచేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణే ప్రజాస్వామ్యానికి బలమని, ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కార్మికులే కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పరిశ్రమలు, కార్మికులు పరస్పర సహకారంతో ముందుకు సాగినప్పుడే పెట్టుబడులు, ఉపాధి పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. కార్మికులకు గౌరవప్రదమైన జీవనం, సరైన వేతనాలు అందినప్పుడే పరిశ్రమల్లో ఉత్పాదకత పెరిగి పారిశ్రామిక శాంతి సాధ్యమవుతుందన్నారు. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మికుల భద్రతను విస్మరిస్తే ఎంతమాత్రం ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు.
యువతలో నైపుణ్యాభివృద్ధి కీలకం
రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా యువతలో నైపుణ్యాభివృద్ధి అత్యంత కీలకమని మంత్రి తెలిపారు. రక్షణ, ఏరోస్పేస్ వంటి ఆధునిక రంగాల పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీ) ఆధునీకరిస్తున్నామని, ఇందులో చేరిన విద్యార్థులకు నెలకు రూ.2 వేల చొప్పున స్టైపెండ్ అందిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేలా స్థానిక యువతకు శిక్షణ ఇస్తున్నామని, ఒక్క జర్మనీలోనే దాదాపు 5 లక్షల ఉద్యోగ అవకాశాలున్నట్లు పేర్కొన్నారు.
భవిష్యత్తులో యూరప్, జపాన్ దేశాల్లోని ఉపాధి అవకాశాలకు అనుగుణంగా యువత ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అలవర్చుకోవాలని సూచించారు. ఈ సదస్సులో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్, మాజీ ఎంపీ రామచంద్ర ఖుంతియా, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్, వివిధ ట్రేడ్ యూనియన్ల నేతలు పాల్గొన్నారు.
