ఏదుల నుంచే డిండికి నీళ్లు.. నార్లాపూర్ నుంచి అదనంగా 0.6 టీఎంసీలు: సీఎం రేవంత్రెడ్డి

ఏదుల నుంచే డిండికి నీళ్లు.. నార్లాపూర్ నుంచి అదనంగా 0.6 టీఎంసీలు: సీఎం రేవంత్రెడ్డి
  • అందులో డిండికి 0.5 టీఎంసీలు, అచ్చంపేట లిఫ్ట్​కు 0.1 టీఎంసీల నీళ్లు
  • 152 మీటర్ల ఎత్తుతోనే తుమ్మిడిహెట్టి నిర్మిస్తం
  • ఈ నెల 23 తర్వాత భేటీకి మహారాష్ట్ర సీఎం అంగీకారం 
  • ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం

హైదరాబాద్, వెలుగు: పాలమూరు జిల్లా నీటికి ఢోకా లేకుండా డిండి, అచ్చంపేట లిఫ్టులకు నీటిని తరలించాలని అధికారులను సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశించారు. నార్లాపూర్​ నుంచి ఏదులకు అదనంగా నీటిని తరలించి అక్కడి నుంచి డిండికి నీళ్లివ్వాలని సూచించారు. పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టు నీటి కేటాయింపులకు ఎలాంటి గండి పడకుండా.. ఏదుల రిజర్వాయర్ నుంచే డిండి ప్రాజెక్టుకు 0.5 టీఎంసీలు, అచ్చంపేట ఎత్తిపోతలకు 0.1 టీఎంసీల నీటిని అందించాలన్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమయ్యే మొత్తం 0.6 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచే అదనంగా సమకూర్చుకోవాలని ఆదేశించారు. 

శ్రీశైలం, నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు ఈ 0.6 టీఎంసీల అదనపు నీటిని లిఫ్ట్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని స్పష్టం చేశారు. శుక్రవారం ఎంసీహెచ్‌‌ఆర్డీలోని బోధి పెవిలియన్‌‌లో ఇరిగేషన్​ ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌‌రెడ్డి సమీక్షించారు. నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించాలా? లేక ఏదుల నుంచి తరలించాలా? అనే అంశంపై మహబూబ్‌‌నగర్, నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధుల మధ్య ఉన్న అభ్యంతరాలు, విజ్ఞప్తులపై సమావేశంలో చర్చించారు. రెండు ప్రాంతాల నుంచి నీటిని తరలిస్తే అయ్యే అంచనా వ్యయం, సాధ్యాసాధ్యాలు, అనుకూలతలు-, ప్రతికూలతలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 

ఈ క్రమంలోనే నార్లాపూర్​ నుంచి అదనంగా నీటిని తరలించాల్సి వస్తే.. ఎక్కడెక్కడ పంపులు, పంప్‌‌హౌస్‌‌లు నిర్మించాలి? ప్రస్తుతం ఉన్న కాలువలు, టన్నెల్ సిస్టమ్ కెపాసిటీ సరిపోతుందా? ఎక్కడైనా కాలువల సామర్థ్యం పెంచాల్సి వస్తుందా? లాంటి అంశాలపై అధికారులను సీఎం   అడిగి తెలుసుకున్నారు. 

దీనివల్ల పాలమూరు ఆయకట్టుకు చుక్క నీరు కూడా తగ్గకుండా డిండి, అచ్చంపేట పథకాలు పూర్తవుతాయని చెప్పారు. ఈ ప్రతిపాదనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.

మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కావాలి..

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్‌‌రెడ్డి​ఆదేశించారు. ఇందుకు తగ్గట్టుగా టెక్నికల్​ రిపోర్టులను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ నెల 23 తర్వాత చర్చలకు ఆహ్వానిస్తానని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవలే సూచనప్రాయంగా తెలిపారని వెల్లడించారు. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మిస్తే ఎంత నీరు లభ్యమవుతుంది? 150 మీటర్ల ఎత్తుతో ఎల్లంపల్లి వరకు ఎంత నీటిని తరలించవచ్చనే అంశాలపై ఇరిగేషన్ ఇంజినీర్లు సీఎంకు  వివరాలు అందించారు. 

ఈ బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్ర పరిధిలో ఒక్క గ్రామం కూడా ముంపునకు గురయ్యే ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు. 152 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే మహారాష్ట్రలో దాదాపు 2,300 ఎకరాల భూములు, అదే 150 మీటర్ల ఎత్తుతో అయితే వెయ్యి ఎకరాల్లోపే భూమి ముంపునకు గురవుతుందన్నారు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్ల ఎత్తుకు అంగీకరించిందని, అయితే అంత తక్కువ ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే ఆశించిన స్థాయిలో నీటిని వాడుకునే అవకాశం ఉండదని సీఎం గుర్తుచేశారు.  మహారాష్ట్రతో జరిగే చర్చల్లో తెలంగాణ నీటి అవసరాలను సమర్థంగా వినిపించాలని మంత్రులకు సీఎం సూచించారు.

ఆదిలాబాద్‌‌లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు 

అటవీ, గిరిజన ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే సంకల్పంతోనే తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మిస్తున్నట్టు సీఎం రేవంత్​ స్పష్టం చేశారు. ‘జల్ -జంగిల్ -జమీన్’ అనే నినాదంతో ఏండ్ల తరబడి పోరాడిన అటవీ ప్రాంత ప్రజలకు ఈ ప్రాజెక్టు ద్వారా శాశ్వత మేలు జరగాలని అన్నారు. ఈ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్రతో చర్చల్లో స్పష్టత రాగానే తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించే కెనాల్ రూట్ డిజైన్లు, భూసేకరణ ప్రక్రియపై వెంటనే దృష్టి సారించాలని ఇంజినీర్లను ఆదేశించారు. 

ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌‌‌‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్​ రెడ్డితో పాటు ఇరిగేషన్​ శాఖ  సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎంవో సెక్రటరీ మాణిక్​ రాజ్, టన్నెల్ సెక్రటరీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్‌‌తో పాటు ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్లు (సీఈలు) పాల్గొన్నారు.