- 114 పతకాలతో నాలుగో ప్లేస్‌లో ఇండియా..
- ఫ్లాగ్ బేరర్స్‌గా నిషాద్ కుమార్, మోనా అగర్వాల్
నగోయా: ఆసియా పారా గేమ్స్‌లో ఇండియా పారా అథ్లెట్లు స్వర్ణాల పంట పండించారు. శుక్రవారం జరిగిన మెన్స్ 400 మీటర్ల టీ64 ఫైనల్లో సందీప్ 52.28 సెకన్ల టైమింగ్‌తో వరల్డ్ రికార్డును నెలకొల్పి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. 0.264 సెకన్ల రియాక్షన్ టైమ్‌తో పరుగు మొదలుపెట్టిన సందీప్.. తన సమీప ప్రత్యర్థి నూర్ అల్సానా (సౌదీ అరేబియా) కంటే 0.85 సెకన్ల ముందుగా లక్ష్యాన్ని చేరాడు. అల్సానా 53.13 సెకన్లతో రెండో ప్లేస్‌లో నిలిచి రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇండియాకే చెందిన అజయ్ కుమార్ (53.61 సెకన్లు) కాంస్య పతకం నెగ్గాడు. అజయ్ టైమింగ్ గేమ్స్ రికార్డుగా నమోదైంది. సందీప్, అల్సానా టీ44లో, అజయ్ కుమార్ టీ64లో పోటీపడ్డారు. ఈ రెండు విభాగాలు కింది అవయవాలు సరిగా లేని అథ్లెట్లకు వర్తిస్తాయి.
మెన్స్ జావెలిన్ త్రో ఎఫ్37/38 ఫైనల్లో హనేయ్ వరల్డ్ రికార్డు పెర్ఫామెన్స్ (60.49 మీటర్లు)తో స్వర్ణాన్ని సాధించాడు. విమెన్స్ లాంగ్ జంప్ టీ47 ఫైనల్లో నిమిష చక్కుంగల్ పరంబిల్ 5.37 మీటర్ల దూరం దూకి సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకుంది. మెన్స్ 1500 మీటర్ల టీ46 ఫైనల్లో ప్రమోద్ బిజార్నియా 4ని.09.65 సెకన్ల టైమింగ్‌లో రజతం గెలిచాడు. మెన్స్ డిస్కస్ త్రో ఎఫ్11 ఫైనల్లో ప్రవీణ్ శర్మ 30.64 మీటర్ల దూరం విసిరి నాలుగో ప్లేస్‌తో సంతృప్తిపడ్డాడు.
విమెన్స్ షాట్‌పుట్ ఎఫ్ 46 ఫైనల్లో అమీషా రావల్ 11.16 మీటర్ల పెర్ఫామెన్స్‌తో నాలుగో ప్లేస్‌లో నిలిచింది. ఓవరాల్‌గా ఈసారి క్రీడల్లో ఇండియా పారా అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. రికార్డు స్థాయిలో 114 పతకాలతో నాలుగో స్థానంతో టోర్నీని ముగించారు. ఇందులో 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్యాలు ఉన్నాయి. హాంగ్జౌ వేదికగా జరిగిన గత క్రీడలతో పోలిస్తే ఈసారి సగం మందితోనే బరిలోకి దిగినా పతకాల పంట పండించారు. ముగింపు వేడుకల్లో నిషాద్ కుమార్, మోనా అగర్వాల్ ఫ్లాగ్ బేరర్స్‌గా వ్యవహరించనున్నారు.
సుమిత్‌కు మళ్లీ గోల్డ్
జావెలిన్ త్రో ఎఫ్ 64 కేటగిరీలో సుమిత్ అంటిల్ మరోసారి స్వర్ణాన్ని నిలబెట్టుకున్నాడు. ఎఫ్ 42–46/61–64 ఫైనల్లో సుమిత్ ఈటెను 72.64 మీటర్ల దూరం విసిరి టాప్ ప్లేస్‌లో నిలిచాడు. సుమిత్ తన రెండో ప్రయత్నంలో ఈ దూరాన్ని అందుకున్నాడు. గతంలో సుమిత్ 73.29 మీటర్ల వరల్డ్ రికార్డుతో స్వర్ణం నెగ్గాడు. మహేంద్ర గుర్జర్ (59.03 మీ), సందీప్ సర్గార్ (64.48 మీ) వరుసగా సిల్వర్, బ్రాంజ్ నెగ్గారు. మెన్స్ క్లబ్ త్రో ఫైనల్లో ప్రణవ్ సూర్మ 32.87 మీటర్ల గేమ్స్ రికార్డుతో గోల్డ్ మెడల్ నిలబెట్టుకున్నాడు. ధర్మవీర్ (27.71 మీటర్లు) కాంస్యం సాధించాడు.
బ్యాడ్మింటన్‌లో మూడు గోల్డ్
పారా బ్యాడ్మింటన్‌లో ఇండియా శుక్రవారం మూడు గోల్డ్ మెడల్స్ గెలిచింది. ఓవరాల్‌గా 16 పతకాలతో టోర్నీని ముగించింది. మెన్స్ సింగిల్స్ ఎస్‌ఎల్ 3 ఫైనల్లో నితేష్ కుమార్ 21-18, 21-16తో ప్రమోద్ భగత్‌పై గెలిచి స్వర్ణాన్ని ముద్దాడాడు. తర్వాత తులసిమతితో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఎస్‌ఎల్ 3-ఎస్‌యూ 5 విభాగంలో సిల్వర్ నెగ్గాడు. ఫైనల్లో నితేష్-తులసిమతి 21-11, 19-21, 14-21తో ఓక్టిలా-హిక్మత్ రామ్దానీ (ఇండోనేసియా) చేతిలో ఓడారు.
మెన్స్ సింగిల్స్ ఎస్‌ఎల్ 4 ఫైనల్లో నవీన్ శివకుమార్ 21-9, 21-17తో ఫ్రెడీ సెటియావాన్ (ఇండోనేసియా)పై గెలిచి గోల్డ్ నెగ్గాడు. విమెన్స్ డబుల్స్ ఎస్‌ఎల్3-ఎస్‌యూ5 ఫైనల్లో తులసిమతి–మానసి జంట 21-16, 21-13తో యాంగ్ కియుక్సియా-జియావో జుక్సియాన్ (చైనా)పై గెలిచి స్వర్ణాన్ని ఖాతాలో వేసుకున్నారు. విమెన్స్ సింగిల్స్ ఎస్‌యూ5లో తులసిమతి 18-21, 11-21తో యాంగ్ (చైనా) చేతిలో ఓడి సిల్వర్‌తో సరిపెట్టుకుంది. విమెన్స్ ఎస్‌హెచ్ 6 ఫైనల్లో నిత్యశ్రీ సుమతి శివన్ 12-21, 13-21తో లీ ఫెంగ్‌మెయి (చైనా) చేతిలో ఓడి రజతం దక్కించుకుంది.
షూటింగ్‌లో స్వర్ణ గురి
ఇండియా పారా షూటర్ మోనా అగర్వాల్... పారా ఆసియా గేమ్స్‌లో వరల్డ్ రికార్డుతో స్వర్ణాన్ని గెలుచుకుంది. శుక్రవారం జరిగిన విమెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఎస్‌హెచ్ 1లో మోనా 357.5 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. దాంతో మెగా ఈవెంట్‌లో రెండో స్వర్ణంతో మెరిసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇండియాకు తొలి పారాలింపిక్స్ ఒలింపిక్ కోటాను అందించింది. పారా షూటింగ్‌లో ఎస్‌హెచ్ 1 విభాగం కాళ్లు లేదా చేతుల్లో వైకల్యం ఉండి తుపాకీ బరువును తమ చేతులతో మోయగలిగే అథ్లెట్ల కోసం ఉద్దేశించబడినది.
నందల్ హ్యాట్రిక్
పారా స్విమ్మర్ హిమాన్షు నందల్ హ్యాట్రిక్ పతకాలు సాధించగా, మొత్తంగా స్విమ్మింగ్‌లో ఇండియాకు 11 పతకాలు వచ్చాయి. మెన్స్ 100 మీటర్ల ఫ్రీస్టయిల్ ఎస్11 ఈవెంట్ ఫైనల్లో నందల్ 1ని 5.90 సెకన్ల టైమింగ్‌తో బ్రాంజ్ మెడల్ గెలిచి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. అంతకుముందు నందల్ మెన్స్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్, 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్‌లోనూ కాంస్యాలు నెగ్గాడు. రవి బుడిగిన ఎస్ 13 వంద మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లలో రజతాలు నెగ్గి, మెన్స్ 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో బ్రాంజ్‌ను సాధించాడు.
మెన్స్ టేబుల్ టెన్నిస్ డబుల్స్ ఎండీ 4 కేటగిరీలో ఇండియాకు కాంస్యం లభించింది. ఫైనల్లో జెహాన్ దొరబ్ మదన్–శుభమ్ వధ్వా 12–14, 7–11, 5–11తో పార్క్ జిన్‌చెయోల్–కిమ్ క్యుంగ్ హ్యూన్ (సౌత్ కొరియా) చేతిలో ఓడారు. అయితే గ్రూప్‌లో టాప్–4లో నిలవడంతో పతకం లభించింది.
