ఆర్అండ్బీ పరీక్షల తేదీలు మార్చాలి.. ఏఈఈ ఎగ్జామ్ రోజే కేంద్ర ప్రభుత్వ ఎగ్జామ్స్ ఉన్నయ్ : ఎంపీ ఆర్ కృష్ణయ్య 

ఆర్అండ్బీ పరీక్షల తేదీలు మార్చాలి.. ఏఈఈ ఎగ్జామ్ రోజే కేంద్ర ప్రభుత్వ ఎగ్జామ్స్ ఉన్నయ్ : ఎంపీ ఆర్ కృష్ణయ్య 
  • లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగాఆందోళనలు చేస్తమని వార్నింగ్​ 

ముషీరాబాద్,వెలుగు: నవంబర్ 6, 7 తేదీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి వారే ఉద్యోగ పోటీ పరీక్షలను నిర్వహించనున్నారని, దీనివల్ల ఏకకాలంలో పరీక్షలు రాయలేని పరిస్థితి నెలకొందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి ఆధ్వర్యంలో ఓయూ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ నేతృత్వంలో పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు విద్యానగర్ బీసీ భవన్ లో ఎంపీ ఆర్ కృష్ణయ్య ను కలిశారు. 

పరీక్షలు వాయిదా వేయడానికి సహకరించాలని కోరారు. కృష్ణయ్య మాట్లాడుతూ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ పేపర్-1 పరీక్షలు దేశవ్యాప్తంగా నవంబర్ 2 నుంచి 6 వ తేదీ వరకు నిర్వహిస్తోందని, అలాగే, రాష్ట్ర ప్రభుత్వ పరీక్ష తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆర్​అండ్​బీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్షలు నవంబర్ 6, 7 తేదీల్లో నిర్వహిస్తోందన్నారు.  

దేశవ్యాప్తంగా జరుగుతున్న పరీక్షలను కేంద్రం వాయిదా వేయదని, రాష్ట్ర ప్రభుత్వం  తేదీలను మార్చాలన్నారు. పరీక్షల తేదీలు మార్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి రాజేందర్, మోడీ రాందేవ్, నీల వెంకటేష్, అనంతయ్య, రాజేందర్, వంశీ, చిక్కుడు బాలయ్య, అభ్యర్థులు పాల్గొన్నారు.