- మల్లన్నసాగర్ కన్నా ముందే కొండ పోచమ్మ సాగర్ పూర్తి
- వందల కోట్లతో మల్లన్నసాగర్ మధ్యలోంచి తాత్కాలిక కెనాల్
- కొండపోచమ్మ నుంచి ఒక్క డిస్ట్రిబ్యూటరీ తవ్వలే..
- కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లియ్యలే
- పాండురంగ చెరువు నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్ వరకూ పైప్ లైన్
- యాదాద్రి జిల్లాకు నీళ్లిస్తామని అప్పట్లో ప్రకటించిన మాజీ సీఎం కేసీఆర్
- బస్వాపూర్, గంధమల్లకు కొండపోచమ్మ సాగర్‌తో సంబంధమే లేదు
- నేరుగా మల్లన్నసాగర్ నుంచే ఈ రెండు రిజర్వాయర్లకు లింకు
- విషయం బయటికి రావడంతో గులాబీ పార్టీ నేతల కట్టుకథలు
హైదరాబాద్, వెలుగు:‘కొండపోచమ్మ సాగర్ కట్టింది కేసీఆర్ఫాంహౌస్కోసం కాదు, దాని ద్వారా ఐదు జిల్లాల్లోని లక్షల ఎకరాలకు నీళ్లందుతున్నాయి..’ అంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనలు పచ్చి అబద్ధాలని స్పష్టమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ కింద ఇప్పటివరకు కొత్తగా ఆయకట్టు రాకపోవడమే ఇందుకు నిదర్శనం. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని చెప్పి కట్టిన ఈ జలాశయానికి డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థేలేదు. ఈ రిజర్వాయర్ చివరకు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు, గజ్వేల్ పరిసరాలకే పరిమితమైంది. వాస్తవానికి ఎగువన ఉన్న మల్లన్న సాగర్ పూర్తయ్యాకే దిగువన ఉన్న కొండపోచమ్మ సాగర్‌కు నీళ్లు రావాలి.
కానీ మల్లన్నసాగర్పూర్తికాకముందే దాని మధ్యలోంచి వందల కోట్ల ప్రజాధనంతో ఒక కెనాల్తవ్వి కొండపోచమ్మ సాగర్‌కు నీళ్లను తరలించారు. అదీ కేవలం కేసీఆర్ఫాంహౌస్పారించుకునేందుకేనా అన్నది చర్చనీయాంశంగా మారింది. కానీ బీఆర్ఎస్ లీడర్లు మాత్రం ఇప్పుడు కొండపోచమ్మ సాగర్‌ద్వారా ‘యాదాద్రికి నీళ్లిస్తున్నాం.. గంధమల్ల, బస్వాపూర్ నింపుతున్నాం’ అని చెబుతున్నారు. సాంకేతిక లెక్కలు, రికార్డులు పరిశీలిస్తే.. ఆ రిజర్వాయర్లకు, కొండపోచమ్మకు సంబంధమే లేదన్న స్పష్టమవుతున్నది.
మల్లన్నసాగర్ కన్నా ముందే కొండపోచమ్మ..?
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా మ ర్కూక్ మండలంలో రూ. 1,668.55 కోట్ల వ్యయంతో, 15 టీఎంసీల సామర్థ్యంతో కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ రిజర్వాయర్ఎగువన 50 టీఎంసీల కెపాసిటీతో మల్లన్న సాగర్నిర్మాణం తలపెట్టారు. నిజానికి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసే నీళ్లు మిడ్‌మానేరు, రంగనాయకసాగర్ మీదుగా మల్లన్న సాగర్ చేరితేనే అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్‌కు తరలించాల్సి ఉంటుంది. కానీ మల్లన్నసాగర్ కన్నా ముందే.. 2020 మే 29న కొండపోచమ్మ సాగర్‌ను ఆగమేఘాల మీద కేసీఆర్ ప్రారంభించారు.
ఇందుకోసం మల్లన్న సాగర్ రిజర్వాయర్ మధ్యలోంచి 18 కిలోమీటర్ల తాత్కాలిక కాలువను తవ్వి, కొండపోచమ్మ సాగర్‌కు నీటిని తరలించారు. మొత్తం మీద సోర్స్ అయిన మల్లన్నసాగర్ పూర్తి కాకముందే కొండపోచమ్మను పూర్తి చేయడం వెనుక మర్మం ఏమిటన్నది హాట్ టాపిక్ గా మారింది. మల్లన్నసాగర్ కింద లక్షల ఎకరాల రైతుల భూములు మునుగుతున్నా పట్టించుకోని గత పాలకులు.. ఎర్రవల్లికి కూతవేటు దూరంలో ఉన్న కొండపోచమ్మను రికార్డు సమయంలో పూర్తి చేసుకోవడం గమనార్హం.
2.85 లక్షల ఎకరాలన్నారు.. ఒక్క డిస్ట్రిబ్యూటరీ కట్టలే
కొండపోచమ్మ సాగర్ కింద ఉమ్మడి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 2,85,280 ఎకరాలకు సాగునీరు అందిస్తామని గత పాలకులు ప్రకటించారు. ఇందుకోసం 13 కాలువలు నిర్మిస్తామని చెప్పారు. రిజర్వాయర్ కట్టి నాలుగేండ్లు దాటినా.. రైతుల పొలాలకు నీళ్లు తీసుకెళ్లేందుకు ఒక్క డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ను పూర్తి చేయలేదు. చెరువులు నింపేందుకంటూ కేవలం రెండు ప్రధాన కాలువలు మాత్రమే తవ్వారు. వీటి ద్వారా నేరుగా గజ్వేల్ పరిధిలోని చెరువులను, వాగులను నింపడం తప్ప.. పొలాలకు నీరిచ్చే డిస్ట్రిబ్యూటరీ, సబ్-డిస్ట్రిబ్యూటరీ, కాలువలు నిర్మించలేదు. దీంతో ఆయకట్టు పరిధిలోని 2.85 లక్షల ఎకరాల్లో ఏ ఒక్క ఎకరా కూడా కొండపోచమ్మ నీళ్లతో సాగులోకి రాలేదు.
యాదాద్రికి నీళ్లంటూ పచ్చి అబద్ధాలు
కొండపోచమ్మ అసలు గుట్టు బయటపడటంతో బీఆర్ఎస్ నేతలు సరికొత్త రాగం అందుకుంటున్నారు. ‘యాదాద్రి భువనగిరి జిల్లాకు తాగు, సాగునీరు ఇవ్వడానికే కొండపోచమ్మ కట్టాం’ అంటూ బుకాయిస్తున్నారు. కానీ ఇరిగేషన్ శాఖ రికార్డులు పరిశీలిస్తే ఇదంతా పచ్చి దగా అని తేలిపోతోంది. కొండపోచమ్మ సాగర్ మొత్తం 2.85 లక్షల ఎకరాల ఆయకట్టులో యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల పరిధిలో ఉన్నది కేవలం 34 వేల ఎకరాలు మాత్రమే. మిగతా 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు అంతా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోనే ఉంది. కాబట్టి యాదాద్రి జిల్లాకు కొండపోచమ్మ ద్వారా నీళ్లిచ్చామనడంలో ఎలాంటి నిజం లేదని తేలిపోతున్నది.
బస్వాపూర్, గంధమల్లకు.. కొండపోచమ్మకు సంబంధమే లేదు
యాదాద్రి జిల్లా దాహార్తి తీర్చాల్సింది కొండపోచమ్మ కాదు.. గంధమల్ల, బస్వాపూర్ (నృసింహస్వామి) రిజర్వాయర్లు. కానీ బీఆర్ఎస్ నేతలు ఈ రెండింటినీ కొండపోచమ్మ సాగర్ఖాతాలో వేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మల్లన్నసాగర్ నుంచే నేరుగా వాటిని లింక్ చేశారు. ప్యాకేజీ-15 (గంధమల్ల), ప్యాకేజీ-16 (బస్వాపూర్) రిజర్వాయర్లకు నీటిని తరలించాల్సింది మల్లన్నసాగర్ జలాశయం నుంచే తప్ప కొండపోచమ్మ సాగర్ నుంచి కాదనేది ఇరిగేషన్ శాఖ వర్గాల మ్యాపులు స్పష్టం చేస్తున్నాయి. ప్యాకేజీ-15 కింద తుర్కపల్లి మండలంలో గంధమల్ల చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని 2017లో ప్రతిపాదించారు.
1.5 టీఎంసీల సామర్థ్యంత్గో దానినిని నిర్మిస్తున్నారు. కానీ పరిహారం విషయంలో రైతులతో వివాదాలు, గత పాలకుల నిర్లక్ష్యంతో ఏండ్ల తరబడి భూసేకరణ కూడా పూర్తి చేయలేదు. ఇక బస్వాపూర్ రిజర్వాయర్ పరిస్థితి మరీ దారుణం. 11.39 టీఎంసీల సామర్థ్యంతో ప్యాకేజీ-16 కింద భువనగిరి వద్ద నిర్మిస్తున్న ఈ భారీ రిజర్వాయర్ అంచనా వ్యయం మొదట రూ. 1,751 కోట్లు కాగా, భూసేకరణ లేక అది రూ. 2,670 కోట్లకు చేరింది. రిజర్వాయర్ కట్ట పనులు చివరి దశకు వచ్చినా.. డిస్ట్రిబ్యూటరీలకు భూసేకరణ జరగలేదు. పక్కపక్కనే ఉన్న అభూములకు వేర్వేరు పరిహారం అందించడం వివాదానికి కారణం అయింది. ఒకే ఏరియా లోని ఒక చోట ఎక్కువ.. అదే చోట వేరే రైతులు తక్కువ పరిహారం అందించడం వంటివి చేశారు. ఉదాహరణకు ఆ ప్రాంతంలోని ఒక రైతుకు ఎకరాకు రూ.16 లక్షల పరిహారం ఇస్తే.. అదే ప్రాంతంలోని ఇంకో రైతుకు కేవలం రూ.8 లక్షల పరిహారం ఇచ్చిన ఘటనలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు.
తోడింది 6 టీఎంసీలు!
కొండపోచమ్మ సాగర్ పూర్తి సామర్థ్యం 15 టీఎంసీలు. ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు ఏటా గరిష్టంగా 6 నుంచి 8 టీఎంసీల నీటిని మాత్రమే మోటార్లతో ఎత్తిపోశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఎత్తిపోసిన నీళ్లు కూడా సింహభాగం కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్ కే తరలాయని తెలుస్తోంది. హల్దీవాగు, నిజాంసాగర్ వైపు, గజ్వేల్ చెరువులకే నీటి తరలింపులు పరిమితమయ్యాయి.
ఫామ్ హౌస్‌కు వాటర్ గ్రిడ్.. రైతుల నోట్లో మట్టి..
సాధారణ రైతుల పొలాలకు పిల్లకాలువలు తవ్వని గత ప్రభుత్వ పెద్దలు.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు మాత్రం అద్భుతమైన పైప్‌లైన్ నెట్‌వర్క్ నిర్మించుకున్నారు. కొండపోచమ్మ నుంచి పాండురంగ చెరువులోకి నీటిని మళ్లించారు. అక్కడి నుంచి 1-ఆర్ డిస్ట్రిబ్యూటరీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ పేరుతో హార్టికల్చర్ శాఖ నిధులను దారిమళ్లించి, నేరుగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోకి భూగర్భ పైప్‌లైన్లు వేశారు. ఫామ్‌హౌస్‌లో ఉన్న భారీ బావులు, అంతర్గత చెరువులు నిరంతరం కళకళలాడేలా ప్రత్యేక మోటార్లు, లిఫ్ట్ సిస్టం ఏర్పాటు చేసుకున్నారు. పక్కన ఉన్న రైతుల పంటలు ఎండి పోయి అల్లాడుతుంటే.. కేసీఆర్ ఫాంహౌస్ మాత్రం పచ్చని పంట పొలాలతో అలరారేలా చేసుకున్నారనే ఆరోపణలున్నాయి.
