ఇయ్యాల్నే చేప ప్రసాదం పంపిణీ

 ఇయ్యాల్నే చేప ప్రసాదం పంపిణీ

హైదరాబాద్‌‌ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో చేప ప్రసాదం పంపిణీకి  ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 8 గంటలకు బత్తిన కుటుంబసభ్యులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేపప్రసాదం పంపిణీని ప్రారంభిస్తారు. కరోనా కారణంగా మూడేండ్ల పాటు చేప ప్రసాదం పంపిణీ జరగకపోవడంతో  ఈసారి  జనం భారీగా తరలివచ్చారు. ఒకరోజు ముందే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో క్యూలైన్లు నిండిపోయాయి. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌‌, వెలుగు: నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 8 గంటలకు బత్తిన కుటుంబసభ్యులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేపప్రసాదం పంపిణీని ప్రారంభించనున్నారు. కరోనా కారణంగా మూడేండ్లుగా చేప ప్రసాదం పంపిణీ జరగలేదు. ఈసారి చేప ప్రసాదం అందిస్తుండటంతో జనం ఒక్కసారిగా తరలివచ్చారు. పంపిణీకి ఒకరోజు ముందే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో క్యూలైన్లు నిండిపోయాయి. చేప ప్రసాదం కోసం వచ్చేవాళ్లకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా ఎంట్రెన్స్ వద్ద ప్రత్యేకంగా 18 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మధ్య మధ్యలో క్యూలైన్లు పెంచుతూ చేప ప్రసాదం కౌంటర్ వద్దకు వెళ్లేసరికి 32 క్యూలైన్లు అవుతాయి. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు దూద్ బౌలిలోని బత్తిన నివాసం వద్ద కూడా చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. 

5లక్షల మంది వస్తరని అంచనా

కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, చత్తీస్​గఢ్ నుంచి ప్రజలు చేప మందు కోసం వస్తారని బత్తిన కుటుంబ సభ్యులు చెప్పారు. దాదాపు 5లక్షల మంది వరకు వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. ఎంతమంది వచ్చినా చేప ప్రసాదం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని బత్తిన సాయినాథ్ గౌడ్ తెలిపారు. 

మెయిన్ సెంటర్ల నుంచి ప్రత్యేక బస్సులు

చేప ప్రసాదం కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​కు వెళ్లేందుకు ప్రధాన కూడళ్ల నుంచి 130 సిటీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌‌, కాచిగూడ రైల్వే స్టేషన్, ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్​సుఖ్​నగర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు వివరించారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరికొన్ని బస్సులు పెంచుతామన్నారు. మెట్రో రైళ్ల సంఖ్య కూడా పెంచనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు తెలిపారు.

రెండ్రోజుల ముందే వచ్చాం

నాకు ఆస్తమా ఉంది. ఇక్కడ చేప ప్రసాదం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి దాకా అంతా మంచిగా ఉంది. గోలీలు తీసుకోవడం లేదు. చేప ప్రసాదం అంటే నమ్మకం ఉంది. మూడేండ్లుగా లేకపోవడంతో ఈసారి వేస్తు న్నారని తెలుసుకొని వచ్చాను. నాతో పాటు మహారాష్ట్ర నుంచి 50 మంది వరకు వచ్చారు.
- చావ్లా, మహారాష్ట్ర 

మూడేండ్లు బంద్​ ఉండే..

మా తాత నాలుగేండ్ల కింద ఇక్కడ చేప ప్రసాదం తీసుకున్నడు. ఆ తర్వాత కరోనా కారణంగా మూడేండ్లు బంద్​ ఉండే. ఈసారి తాతతో పాటు మా ఫ్యామిలీ మొత్తం చేప ప్రసాద్​ కోసం వచ్చినం. 8 మందిమి ప్రసాదం తీసుకొని ఇంటికెళ్తం. ఎక్కువ మంది వస్తార ని తెలుసుకుని ఒకరోజు ముందే వచ్చినం.
- ఫైజల్‌‌, ఢిల్లీ