ఐదు యాక్సిడెంట్లు..పది మంది మృతి

ఐదు యాక్సిడెంట్లు..పది మంది మృతి
  • ఖమ్మం జిల్లా వైరాలో ముగ్గురు దుర్మరణం
  •  మృతుల్లో ఏడాదిన్నర పాప
  •  హనుమకొండ జిల్లాలో అన్నాచెల్లెళ్లు
  • మహబూబాబాద్‌ జిల్లాలో నవ దంపతులు మృతి
  • భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు.. నల్లగొండ జిల్లాలో మరొకరు

వెలుగు, నెట్​వర్క్: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పది మంది చనిపోయారు. ఖమ్మం జిల్లా వైరాలో లారీ, కారు ఢీకొని ముగ్గురు మృతిచెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన మరో యాక్సిడెంట్​లో అన్నాచెల్లెళ్లు చనిపోయారు. మహబూబాబాద్‌‌‌‌ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల వద్ద బైకును ఇసుక లారీ ఢీకొట్టిన ఘటనలో నవ దంపతులు మృతి చెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో బైక్, గూడ్స్ ట్రాలీ, కారు ఢీకొని ఇద్దరు చనిపోయారు. నల్లగొండ జిల్లా డిండి మండలం దాసరి నెమలి పూర్ తండా వద్ద ట్రాక్టర్, ఆటో ఢీకొని ఒకరు చనిపోయారు.

వైరా/ధర్మసాగర్/మరిపెడ/మహాముత్తారం/డిండి, వెలుగు: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం వాత్య నాయక్ తండాకు చెందిన బానోత్ బాబు తన ఫ్యామిలీతో శుక్రవారం కారులో బాసర వెళ్లాడు. తన కూతురు అక్షర అభ్యాసం పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరాడు. వైరా మండలం స్టేజీ పినపాక గ్రామం వద్దకు రాగానే వారి కారును తల్లాడ నుంచి వైరా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకటిన్నరేండ్ల పాప బానోత్ శ్రీవల్లి, పాప తల్లి అంజలి (30), తాత అజ్మీర రాంబాబు (58) చనిపోయారు. బానోత్ బాబు, బానోత్ రాణి, బానోత్​ ప్రవీణ్, బానోత్​ కార్తికేయకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్​కు తరలించారు.

రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు మృతి 

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం, రాంపూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు స్పాట్​లోనే చనిపోయారు. హసన్​పర్తి మండలం నాగారాం గ్రామానికి చెందిన సుజిత్​ రెడ్డి (28), పూజా రెడ్డి (22) అన్నాచెల్లెళ్లు. తండ్రి చనిపోవడంతో ఇద్దరూ హైదరాబాద్​లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తల్లిని చూసుకుంటున్నారు. బైక్​పై హైదరాబాద్ నుంచి హన్మకొండ వైపు వెళ్తున్నారు. రాంపూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఇద్దరూ స్పాట్​లోనే చనిపోయారు. లారీ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని ధర్మసాగర్​ సీఐ రమేశ్ తెలిపారు.

ఇసుక లారీ ఢీకొని దంపతులు..

ఇసుక లారీ ఢీకొట్టడంతో నవ దంపతులు చనిపోయారు. ఈ ఘటన మహబూబాబాద్‌‌‌‌ జిల్లా మరిపెడ మండల పరిధిలో జరిగింది. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండం చల్లగరిక గ్రామానికి చెందిన తునగరి నారాయణ (27) కు మూడు నెలల కింద మరిపెడకు చెందిన అంజలి (22) తో పెండ్లైంది. హైదరాబాద్‌‌‌‌లో నారాయణ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ జాబ్​ చేస్తున్నాడు. బైక్​పై మరిపెడ వెళ్తుండగా తానంచర్ల పెట్రోల్ బంక్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ బైక్​ను ఢీకొట్టడంతో ఇద్దరూ స్పాట్​లోనే చనిపోయారు.

మూడు వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మేడారం మెయిన్ రోడ్డుపై బైక్, గూడ్స్ ట్రాలీ, కారు ఢీకొని ఇద్దరు చనిపోయారు. కొర్లకుంటలో అశోక్ సెలూన్ షాప్ నిర్వహిస్తున్నాడు. బీసీ లోన్ అప్లై చేసుకునేందుకు భార్యతో కలిసి బైక్​పై మహాముత్తారం వెళ్లాడు. ఎండ ఎక్కువ ఉండటంతో రిటర్న్ లో భార్యను తెలిసినోళ్ల కారులో ఇంటికి పంపించాడు. దొబ్బలపాడు-, -కొర్లకుంట గ్రామాల మధ్య కారును ఓవర్ టేక్ చేస్తుండగా, అదే టైంలో ఎదురుగా గూడ్స్ ట్రాలీ వచ్చింది. బైక్, ట్రాలీ, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. గూడ్స్ ట్రాలీలో ప్రయాణిస్తున్న గోదావరిఖని పట్టణం అడ్డగుంటపల్లికి చెందిన చిల్ల సమ్మక్క (65), అశోక్ (32) స్పాట్​లోనే చనిపోయారు. ట్రాలీ డ్రైవర్ శ్రీశైలం, రాజేశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి. మంగపేటలో ఉన్న బంధువుల పెండ్లికి ట్రాలీలో సమ్మక్క వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. డెడ్​బాడీలను పోస్టుమార్టం కోసం మహదేవపూర్ దవాఖానకు తరలించారు.

ట్రాక్టర్, ఆటో ఢీకొని..

నల్లగొండ జిల్లా డిండి మండలం దాసరి నెమలి పూర్ తండా వద్ద ట్రాక్టర్, ఆటో ఢీకొని ఒకరు చనిపోయారు. దాసరి నెమలి పూర్ తండాకు చెందిన వర్త్య పాండు (48) ఎర్రకుంట చెరువు వద్ద నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొని ఆటోలో స్వగ్రామానికి బయలుదేరాడు. ఆటోను ట్రాక్టర్​ ఢీకొట్టడంతో పాండు స్పాట్​లోనే చనిపోయాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతుడి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ దేవరకొండ గవర్నమెంట్​ హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు.