రోడ్డు ప్రమాదాల్లో ఒక్కరోజే ఐదుగురు మృతి

రోడ్డు ప్రమాదాల్లో ఒక్కరోజే ఐదుగురు మృతి
  • శామీర్ పేట ఓఆర్ఆర్​పై లారీని ఢీకొట్టిన కారు
  • చనిపోయిన ముగ్గురు.. మరో నలుగురికి గాయాలు
  • మేడ్చల్ టౌన్​లో  కంటెయినర్ ఢీకొని మరో ఇద్దరు మృతి

మేడ్చల్, వెలుగు: మేడ్చల్ జిల్లాలో శనివారం ఒక్కరోజే జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు చనిపోయారు. శామీర్ పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలానికి చెందిన ఆరుగురు ఫ్రెండ్స్ బైరి మారుతి(31), ఈదులకంటి బాలరాజు గౌడ్(43), శ్రీనివాస్, సూరజ్, సురేశ్, వరుణ్ కారులో తిరుపతికి వెళ్లారు. శుక్రవారం రాత్రి తిరిగి సిటీకి బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున ఈ ఆరుగురు కారులో కీసర నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్నారు. కారును మారుతి డ్రైవ్ చేస్తున్నాడు.  ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వెల్లిచేరు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ ప్రసాద్(24) అదే రూట్​లో వెళ్తున్నాడు. శామీర్ పేట పరిధి ఓఆర్ఆర్ వద్ద లారీ టైరు పేలడంతో ప్రసాద్ వెహికల్ ను పక్కకు ఆపాడు.

 ప్రసాద్ లారీ టైర్ మార్చే పనిలో ఉన్నాడు. అదే టైమ్​లో కారు డ్రైవ్ చేస్తున్న మారుతి నిద్రమత్తు కారణంగా ఓఆర్ఆర్ రెయిలింగ్​ను ఢీకొడుతూ ఆగి ఉన్న లారీ వైపు వేగంగా పోనిచ్చాడు. లారీతో పాటు టైరు మారుస్తున్న ప్రసాద్​ను ఢీకొట్టాడు. ప్రమాదంలో మారుతితో పాటు కారులో ఉన్న అతడి ఫ్రెండ్ బాలరాజు గౌడ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్  ప్రసాద్​కు సైతం తీవ్ర గాయాలు కాగా.. అతడిని దగ్గరలోని హాస్పిటల్​కు తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ ప్రసాద్ చనిపోయాడు. కారులో ఉన్న శ్రీనివాస్, సూరజ్, సురేశ్​కు సైతం బలమైన గాయాలయ్యాయి. మరో వ్యక్తి వరుణ్ స్వల్పంగా గాయపడ్డాడు. పోలీసులు వీరిని హాస్పిటల్​కు తరలించారు. డెడ్​బాడీలను గాంధీకి పంపించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కంటెయినర్ బీభత్సం..  సంగారెడ్డి జిల్లా ఆర్సీపురానికి చెందిన యశోద(26) ఓ హాస్పిటల్​లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నది. శనివారం ఆమె మేడ్చల్ హైవే వద్ద రోడ్డు దాటుతుండగా.. ఓ కంటెయినర్ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యశోద అక్కడికక్కడే మృతి చెందింది. అదే కంటెయినర్ కొంతదూరం వెళ్లాక సుభాష్(38) అనే వ్యక్తిని ఢీకొట్టడంతో అతడు కూడా స్పాట్​లోనే మృతి చెందాడు. సుభాష్ ఐటీసీ ఫ్యాక్టరీలో ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ప్రమాదానికి కారణమైన కంటెయినర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డెడ్​బాడీలను ఆస్పత్రికి తరలించామన్నారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్ రెడ్డి తెలిపారు.